తాజాగా వెల్లడైన రాజ్యసభ ఫలితాలు

Published: Saturday June 20, 2020

తాజాగా వెల్లడైన రాజ్యసభ ఫలితాలు అధికార బీజేపీకి భారీ ఊరటనే ఇచ్చాయి. ఇంత కాలం పెద్దల సభలో సంఖ్యా పరంగా ఇబ్బందులు తప్పవేమో అన్న భయాందోళన నేపథ్యంలో కాంగ్రెస్ కంటే రెండింతల సంఖ్యను కమలం పెంచుకుంది.  అధికార బీజేపీకి ప్రస్తుతం 86 సీట్లుండగా, కాంగ్రెస్‌కు 41 సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 245 మంది సభ్యులున్న సభలో బీజేపీ 100 మంది సభ్యులను కలిగి ఉంది. దాని మిత్ర పక్షాలతో కలుపుకుంటే బీజేపీ ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్లే.

 

అన్నా డీఎంకే (9), బీజేడీ (9), వైసీపీ (6), మిగిలిన నామినేట్, చిన్న చితకా పార్టీలను కలుపుకుంటే బీజేపీ సునాయాసంగా రాజ్యసభలో చక్రం తిప్పొచ్చు. రాజ్యసభలో తన బలాన్ని పెంచడానికి ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులతో పాటు బీజేపీ తన బలం మీద కూడా ఆధారపడింది.

 

అయితే సంఖ్యా బలం తక్కువగా ఉండటంతో 2014 నుంచి 19 వరకూ మోదీ ప్రభుత్వం ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే 19 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటిలో అధికార బీజేపీ 8 స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, వైసీపీ చెరో 4 స్థానాలను ఖాతాలో వేసుకున్నాయి. మరో మూడింటిని ఇతరులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగినట్లైంది.