ఏడాదిన్నర ముందే వచ్చిన లక్కీ ఛాన్స్..

రాజ్యసభకు మంత్రి మోపిదేవి వెంకటరమణ ఎన్నిక కావడంతో ఖాళీ అయ్యే ఆ పదవిని దక్కించుకునేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వాస్తవానికి సీఎం జగన్ ముందుగా ప్రకటించిన ప్రకారం రెండున్నరేళ్లు తర్వాత మంత్రివర్గంలో మార్పులు, చేర్పులుకు అవకాశం ఉండేది. అయితే ఈ పరిణామంతో ముందుగానే జిల్లాలో మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే అవకాశం వచ్చింది. పెద్ద జిల్లా కావడం పైగా రాజధాని కేంద్రం కూడా కావడంతో గుంటూరు జిల్లాలో ఒక్క మంత్రితో సరిపెట్టే పరిస్థితి ఏమాత్రం ఉండదని ఆశావహులు భావిస్తున్నారు. తప్పనిసరిగా జిల్లాలో మరో ఎమ్మెల్యేకి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. ఆ అవకాశమేదో తామే దక్కించుకోవాలని ఎవరికివారు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
ఒకరిద్దరు ఎమ్మెల్యేలు రెండో మంత్రి పదవిపై కన్నేసి సీఎం దృష్టిలో పడేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రి సుచరిత ఎస్సీ సామాజిక వర్గం కావడంతో ఆ సామాజిక వర్గంకు చెందిన వారికి ఎమ్మెల్యేలకు చోటు కల్పించే అవకాశం లేనందున మిగతా సామాజికవర్గాల వారు ఆశలు పెంచుకొని రెండోమంత్రి పదవిని దక్కించుకునేందుకు ఆరాట పడుతున్నారు.
రాజ్యసభకు ఎంపికైన మోపిదేవి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అదే సామాజిక వర్గం వారికి ఇచ్చే అవకాశం ఉందనే విశ్లేషణతో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆమె జగన్ దృష్టిని ఆకర్షించేందుకు తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కరోనా.. లాక్‌డౌన్ నేపథ్యంలో బాధితులకు నిత్యావసరాలు, ఇతరత్రా సదుపాయాలు కల్పించడంలో జిల్లాలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. నియోజకవర్గంలో ఆమె పనితీరు కూడా కలిసి వస్తుందని, మంత్రి పదవిలో ఉన్న ప్రత్తిపాటి పుల్లారావును ఓడించడం కూడా తనకు ప్లస్ పాయింట్‌గా ఆమె భావిస్తున్నారు.
జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా పేరొందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండో మంత్రి పదవి తనకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. తొలి విడత కేబినెట్‌లోనే తనకు చోటు దక్కుతుందని ఆయన ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా చేజారినప్పటికీ రెండున్నరేళ్ల తర్వాత జరిగే మార్పులు, చేర్పుల్లో తప్పనిసరిగా కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆనాడు ఆయన భావించారు. అయితే అనుకోకుండా జరిగిన పరిణామాలతో ముందే వచ్చిన అవకాశాన్ని దక్కించుకోవాలని ఆయన ఆశిస్తున్నారు.

Share this on your social network: