టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా : ముత్తంశెట్టి ధ్వజం

Published: Monday July 06, 2020

ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు, చంద్రబాబు విశాఖను పరిపాలనా రాజధాని కాకుండా అడ్డుకుంటున్నారని పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. అన్ని పార్టీల్లోనూ చంద్రబాబు మనుషులు ఉండడంతో అమరావతిపై ఆయనకు మద్దతుగా కొంతమందితో మాట్లాడిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో రాజధాని వద్దని ఆయన అనుకుంటే దీనిపై రిఫరెండం నిర్వహించాలని.. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కావాలని కోరితే à°ˆ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు సిద్దమేనా అని సవాల్‌ విసిరారు. ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిలో ఏ పని పూర్తిచేయలేదని విమర్శించారు. అమరావతిపైనా, అక్కడి రైతులు, ప్రజలపైనా సీఎం జగన్‌కు ఎలాంటి కక్ష లేదని చెప్పారు. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వేజోన్‌ ఏర్పాటు పనుల ప్రారంభంపై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జగన్‌ 2022 తర్వాత ముఖ్యమంత్రిగా ఉండరని మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారని.. ఆయన జోస్యం చెబుతున్నారా.. లేక చంద్రబాబుతో కలిసి ఏదైనా కుట్ర పన్నుతున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు.