ధర్మాన కృష్ణదాసు తొలిఫైలుపై సంతకం

బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా గుర్తిస్తున్నాం’... అంటూ రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు తొలిఫైలుపై సంతకం పెట్టారు! ‘అబ్బో ఎంత చక్కని నిర్ణయమో’ అని అంతా అనుకున్నారు. అసలు విషయమేమిటంటే... ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయానికి నకలు మాత్రమే! కాకపోతే... అప్పట్లో తెల్ల రేషన్ కార్డు అని ఉండేది. ఇప్పుడు దానిని ‘బియ్యం కార్డు’గా మార్చారు. మరికొన్ని పదాల్లో మార్పులు మాత్రమే జరిగాయి! దీనిపైనా ఎవరికైనా సందేహముంటే... చంద్రబాబు హయాంలో రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఉండి ఈ జీవో జారీ చేసిన, ఇప్పుడు ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ఉన్న అజేయ కల్లంనే అడగొచ్చు!
సహజంగా కొత్త శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రులు... సరికొత్త నిర్ణయాలపై సంతకాలు పెడతారు. కానీ, ధర్మాన కృష్ణదాసు చేత పాత నిర్ణయాన్నే కొత్తగా ‘పునరుద్ఘాటించారు’. రేషన్ కార్డును ఆదాయ ధ్రువపత్రంగా పరిగణించాలని చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబరు 186 జారీ చేసింది. అనేక అధికారిక సంప్రదింపులు, శాఖలతో మాట్లాడిన తర్వాత 2015 మే 26న ఈ జీవో ఇచ్చారు. దీని ప్రకారం పేదల వద్ద ఉండే రేషన్ కార్డునే ఆదాయ ధ్రువపత్రంగా పరిగణించాలి. రేషన్‌కార్డు లేని వారికి స్వీయ ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా నాలుగేళ్ల కాల వ్యవధితో కొత్తగా ఇన్‌కమ్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ, పైవేటు సంస్థలు, కార్పొరేషన్‌లు, సంక్షేమ పథకాలు అమలు చేసే విభాగాలు, బ్యాంకులు, ఉద్యోగ సంస్థలు ఎలాంటి నిబంధనలు పాటించాలో అందులోనే సవివరంగా చెప్పారు. ఇది ఇచ్చిన రెండేళ్ల తర్వాత సర్కారు మరో జీవో 229 జారీ చేసింది.
అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఈ జీవోను జారీ చేశారు. 186 జీవోను ట్రూస్పిరిట్‌తో అమలు చేయడం లేదని, ఇంకా అనేక శాఖలు, విభాగాలు ఆ జీవో సారాంశాన్ని అర్థం చేసుకోలేదని అందులో తెలిపారు. పాత జీవోలో ఒక్క పదం కూడా మార్చకుండా ‘రేషన్ కార్డే పేదలకు ఇన్‌కమ్ సర్టిఫికెట్’ అని పునరుద్ఘాటించారు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
వెరసి... రేషన్ కార్డును ఆదాయ ధ్రువీకరణ పత్రంగా గుర్తించాలని చంద్రబాబు హయాంలోనే రెండు జీవోలు జారీ అయ్యాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత, ఇదే అంశంపై జగన్ సర్కారు జీవో 205ను జారీ చేసింది. గతంలో ఇచ్చిన 186, 229 జీవోలను తొక్కిపెడుతూ ఇదే ఫ్రెష్ అనేలా కలరింగ్ ఇచ్చారు. ఇందులో మారింది రెండే అంశాలు! ఒకటి... రేషన్‌కార్డు స్థానంలో బియ్యం కార్డు అని పెట్టారు. రెండు... ‘‘ప్రజలు తమ విలువైన సమయం, పనులను మానుకొని ఇన్‌కమ్ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా చేస్తున్నాం’’ అని జీవో 186లో పేర్కొనగా... ‘‘ఇన్‌కమ్ సర్టిఫికెట్ల జారీ అతిపెద్ద పనిగా మారింది. రెవెన్యూ యంత్రాంగం శక్తి అంతా దానికే డైవర్ట్ అవుతోంది. అందుకే బియ్యం కార్డే ఇన్‌కమ్ సర్టిఫికెట్‌గా ఇస్తున్నాం’’ అని కొత్త జీవోలో రాసుకొచ్చారు. ఇక మిగిలిన అంశాలన్నీ సేమ్ టు సేమ్. గతంలో ఇచ్చిన జీవోలు ట్రూ స్పిరిట్‌తో అమలుకాలేదన్న అంశాన్ని కూడా ఇందులో పునరుద్ఘాటించారు.

Share this on your social network: