డీజీపీపై ఫైర్ అయి..గవర్నర్ ను తోసేసిన సీఎం

ఫైర్ బ్రాండ్ నాయకురాలు - పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ అనూహ్యమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కర్నాటక సీఎంగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మమత ప్రవర్తన విస్మయకరంగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు వస్తూనే.. కర్నాటక డీజీపీపై సీరియస్ అయ్యారు. వేదిక వద్దకు వచ్చేందుకు ఆమె కొంత దూరం నడవాల్సి వచ్చింది. దీంతో ఆమె అసహనం వ్యక్తం చేయడమే కాకుండా డీజీపీపై ఫిర్యాదు చేశారు. ఈ ఎపిసోడ్ వివాదం సద్దుమణగకముందే...మరో సందర్భంలో ఆమె ఆశ్చర్యకరంగా ప్రవర్తించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కోల్ కతా పర్యటనలో ఆమె ఏకంగా గవర్నర్ నే పక్కకు తోసేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
కోల్ కతాలో బంగ్లాదేశ్ భవన్ ను ప్రారంభించేందుకు హసీనా భారత పర్యటనకు వచ్చారు. పొరుగుదేశం ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలికేందుకు కోల్ కతాకు చేరుకున్న ప్రధాని మోడీకి విమానాశ్రయంలో గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి - కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగతం సందర్భంగానే గవర్నర్ పట్ల అనూహ్య రీతిలో మమత వ్యవహరించారు. తనకు వెల్కం చెప్పేందుకు వస్తున్న సీఎం మమతాబెనర్జీకి మోడీ సైగ చేస్తూ ఆమె నడిచే దారిలో హెలీప్యాడ్ కోసం వేసిన సున్నం ఉందనే సూచన చేశారు. అనంతరం జరిగిన ఫొటో సెషన్ సందర్భంగా ప్రధాని మోడీకి గవర్నర్ త్రిపాఠి అడ్డంగా ఉండటంతో...మమత ఒక్క ఉదుటున..గవర్నర్ ను రెండు చేతులతో పక్కకు లాగేశారు. దీంతో షాక్ తిన్న గవర్నర్ త్రిపాఠి ఇటు ప్రధాని వైపు అటు సీఎం మమత వైపు చూశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దుతున్నారా అన్నట్లుగా..`.పర్లేదు` అంటూ మోడీ గవర్నర్ కు సైగ చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
కాగా సిద్ధాంతపరంగా ప్రధాని మోడీపై తృణమూల్ అధినేత్రి మమత నిప్పులు చెరిగే సంగతి తెలిసిందే. అదే సమయంలో దీదీ విషయంలో కూడా మోడీ విరుచుకుపడుతుంటారు. అలాంటిది మమతకు ఇబ్బందికలగకుండా మోడీ చూడటం ఆమె ఆశ్చర్యకర ప్రవర్తనను మోడీ సంయమనంతో చక్కదిద్దడం చూస్తుంటే..సిద్ధాంతపరమైన విరోధులు అయినప్పటికీ...పరిణతి చెందిన రాజకీయ నాయకులు అనిపించుకున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.

Share this on your social network: