ప్రమాణం చేస్తే.. రాజకీయాలు బంద్‌ చేస్తా : మోత్కుపల్లి

Published: Wednesday May 30, 2018

తాను ఏనాడూ చంద్రబాబును గవర్నర్‌ పదవి అడగలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అడిగినట్లు ఆయన కుమారుడు లోకేశ్‌పై ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. ఏపీలో చంద్రబాబు ఓడిపోయేలా చూడాలంటూ త్వరలో తాను మెట్లు ఎక్కి వేంకటేశ్వరస్వామిని వేడుకుంటానన్నారు. బహ్కిరణ వేటు నేపథ్యలో మంగళవారం తన నివాసంలో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయాల్లో నీ అంత నీతిమాలిన వ్యక్తి లేడు. జెండా సిద్ధాంతాలు నీకు తెలియవు. 1982లో మేమంతా సభ్యత్వం చేసినప్పుడు ఎక్కడున్నవ్‌?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. పనికిమాలిన వారితో తనను తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘ఓటుకునోటు కేసులో నిన్ను, నీ అనుచరుడు రేవంత్‌ను కేసీఆర్‌ దొంగను పట్టుకున్నట్లు పట్టుకుంటే కాళ్లబేరానికి రాలేదా? మోదీ దగ్గరకు వెళ్లలేదా? పార్టీ నుంచి రేవంత్‌ వెళ్లిపోయాక ఆయన్ను ఏమీ అనవద్దని రమణకు చెప్పలేదా?’ అని ప్రశ్నించారు. తానెవరికీ అన్యాయం చేయలేదని, కానీ.. తనకు చంద్రబాబు అన్యాయం చేశారని చెప్పారు. కోట్లు సంపాదిస్తున్న చంద్రబాబు సింగపూర్‌, దుబాయ్‌లలో దాచుకుంటున్నారని ఆరోపించా రు. ఆయన అక్రమ సంపాదనపై కేంద్రం సీబీఐ విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు ఉన్నంతకాలం మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వరని తేల్చిచెప్పారు.