రైతు ర్యాలీలో రాహుల్.....

గిట్టుబాటు ధరలు వర్తింపజేయడం, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, రైతు రుణాల మాఫీ తదితర డిమాండ్లతో రైతులు చేపట్టిన పదిరోజుల దేశవ్యాప్త ఆందోళన ఆదివారం మూడోరోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈనెల 6న మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్‌లో జరిగే రైతు ర్యాలీలో తాను పాల్గొంటున్నట్టు రాహుల్ తెలిపారు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు (6వ తేదీ) మాండసౌర్‌లో రైతులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.
మాందసౌర్ రైతు ర్యాలీలో తాను పాల్గొంటున్నట్టు రాహుల్ ఓ ట్వీట్‌లో తెలిపారు. 'మన దేశంలో ప్రతిరోజూ 35 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల కన్నీళ్లు తుడవడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగానే రైతులు పదిరోజుల ఆందోళనకు దిగారు. జూన్ 6న జరిగే మాండసౌర్‌లో జరిగే రైతు ర్యాలీలో పాల్గొని ప్రసంగించబోతున్నాను' అని రాహుల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు గత ఏడాది జరిగిన మాండసౌర్ పోలీసు కాల్పుల ఘటనే నిదర్శనమని, అందుకు నిరసనగా, రైతు డిమాండ్ల పరిష్కారం కోసం లక్షలాది మంది రైతులు పది రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు జరుపుతున్నట్టు కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.

Share this on your social network: