భయపెట్టి, బలహీనులుగా చేసే వారిపై పోరాడతా

Published: Tuesday June 05, 2018

ఆంధ్రప్రదేశ్ లో మొన్నటి వరకు టీడీపీతో దోస్తీ కట్టి ప్రస్తుతం ఆ పార్టీపైనే తెగ విమర్శలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అధికార పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మన ఆట, పాట, సంప్రదాయాలకు గౌరవమిచ్చే అభివృద్ధి ఉండాలి కానీ, మన ఉనికిని ప్రశ్నార్థకం చేసే అభివృద్ధి అవసరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రకృతికి దగ్గరగా జీవించేవారి మనసు, ఆలోచనల్లో స్వచ్ఛత ఉంటుందని, వారి జీవనంలో అవినీతికి తావు ఉండదని చెప్పారు అరకు రీసార్ట్ లో ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సమస్యలు, అత్యవసరంగా కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకుందని అన్నారు. ప్రకృతికి దగ్గరగా బతికేవాళ్ల దగ్గర అవినీతి ఉండదు. దానిని దాటి ఏదో సంపాదించుకోవాలన్న అత్యాశతోనే అవినీతికి బీజం పడుతుంది. అభివృద్ధికి మైనింగ్ అవసరమే. అయితే అది ఎక్కడ తవ్వాలి? ఎంతమేరకు? అనేది నిబంధనలకి అనుగుణంగా ఉండాలి. 

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికింద తవ్వినా ఏదో ఒక ఖనిజం దొరుకుతుంది.గిరిజనులను భయపెట్టి, బలహీనులుగా చేసే వారిపై పోరాడటానికి వచ్చాను. ఈ విషయంలో మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. బాక్సైట్ తవ్వకాలపై గ్రామ సభలు పెట్టి, 70 శాతం ప్రజల ఆమోదంతోనే తవ్వకాలు జరపాలి. కొద్దిమంది ఏసీ గదుల్లో కూర్చొని గిరిజన పాలసీలు రాస్తున్నారు. 

వారు గిరిజన గూడేలు తిరిగి పాలసీ రాస్తే అది ఉపయోగపడుతుంది. మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. దానిని నేను ప్రశ్నిస్తే నాపై గిరిజనుల్ని రెచ్చగొట్టారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితం కులాల మధ్య కుమ్ములాటలు పెట్టడానికి పనికొచ్చింది" అని అన్నారు.