25 మందీ రాజీనామా చేస్తే.. హోదా వచ్చేది

Published: Thursday June 07, 2018
రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది సీఎం చంద్రబాబుకు తెలిసినా.. కేసులు పెడతారన్న భయంతో టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడంలేదని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో బుధవారం ఆయన పాదయాత్ర మొదలుపెట్టి.. సాయంత్రం పెరవలి మండలం నడిపల్లికోటలో ముగించారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు.
 
 
‘ప్రత్యేక హోదా కోసం మన రాష్ట్రం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయడం వల్ల కేంద్రంపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తీసుకురాలేకపోయాం. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌, రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్‌ బాగుపడాలంటే హోదా అవసరం. అందుకోసమే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. అవి ఆమోదం పొందాయి. విభజన హామీలను కేంద్రం నిలబెట్టుకోకపోవడం వల్లే ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే 25 మంది ఎంపీలూ ఒకేసారి రాజీనామా చేసి.. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే 25 స్థానాలూ ఖాళీ అయ్యేవి. మరింత పెద్ద చర్చనీయాంశంగా మారేది. చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ లేకపోవడం మన ఖర్మ. ఇంతకన్నా దౌర్బాగ్యం ఏముంటుంది? ఉప ఎన్నికలు వస్తే... చంద్రబాబు తన అభ్యర్థులను నిలిపితే అది మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఆయనకు డిపాజిట్లూ రావు. 14 నెలల కాలం తమ ఎంపీ పదవులు ఉన్నప్పటికీ వైసీపీ ఎంపీలు త్యాగం చేసి.. చిత్తశుద్ధితో రాజీనామాలు చే శారు. వారికి సెల్యూట్‌ చేస్తున్నా’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. కాగా.. జగన్‌ గురువారం యాత్రలో నిడదవోలు మండలం మునిపల్లి చేరుకుంటారు. అక్కడ పాదయాత్ర ముగించి హైదరాబాద్‌ బయల్దేరి వెళ్తారు.