నాన్న దీవెనలే నడిపిస్తున్నాయి
Published: Monday July 09, 2018

ప్రజల ఆశీస్సులు, నాన్న దీవెనలే తనను నడిపిస్తున్నాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ఆదివారం 208వ రోజున 2500 కిలోమీటర్లకు చేరుకుంది. శనివారం సాయంత్రమే తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గానికి చేరుకున్న ఆయన రాయవరం మండలం పసలపూడిలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 69 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.
పాదయాత్ర 2500 కిలోమీటర్లకు చేరుకోవడంతో పసలపూడి వంతెనకు ఎదురుగా మొక్కను నాటారు. పసలపూడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర చెల్లూరు, మాచవరం, సోమేశ్వరం గ్రామాల మీదుగా 7.3 కిలోమీటర్ల మేర సాగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ రాజన్నరాజ్యం వస్తోందని, కష్టాలన్నీ తీరుతాయని జగన్ భరోసా ఇచ్చారు. కాగా, 2013లో విపక్షనేతగా చంద్రబాబు చేపట్టిన ‘మీ కోసం వస్తున్నా’ పాదయాత్ర కూడా ఆ ఏడాది మార్చి 25న 175 రోజులు పూర్తి చేసుకొని మండపేట చేరేసరికి 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరింది. మండపేట కరాచీ సెంటర్‌లో శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రస్తుతం జగన్ చేపట్టిన యాత్ర కూడా ఇదే నియోజకవర్గంలో 2500 కిలోమీటర్లకు చేరుకొంది.

Share this on your social network: