ఎవరితోనూ మాకు పొత్తు అవసరం లేదు

Published: Wednesday July 11, 2018
 ‘రాష్ట్రంలో ఎవరితోనూ మాకు పొత్తు అవసరం లేదు. ప్రజల అవసరాలు తెలుసుకుని పాలించాం.. వారి మద్దతుతోనే తిరిగి ఆంధ్రలో అధికారం చేపడతాం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరు రాజీవ్‌గాంధీ భవన్‌లోజిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ముందుగా కార్యకర్తలనుద్దేశించి చాందీ మాట్లాడారు. ‘ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. విభజన సమయంలో హోదాపై అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో స్పష్టమైన ప్రకటన చేశారు. కేంద్ర కేబినెట్‌లో తీర్మానం కూడా ఆమోదించారు. హోదా ఐదేళ్లు చాలదన్న అప్పటి బీజేపీ పెద్దలు.. ఇప్పుడెందుకు ఇవ్వడం లేదు? రాష్ట్ర అభివృద్ధికి కావలసిన అన్ని నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్‌ చట్టం రూపొందించింది.
 
మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ వాటిని పార్లమెంటు సాక్షిగా తుంగలో తొక్కుతున్నారు’ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు వైసీపీ, జనసేన.. ప్రధానిని, కేంద్రాన్ని విమర్శించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. దేశంలో రానున్నది యూపీఏ-3 ప్రభుత్వం అని, ప్రధానిగా రాహుల్‌గాంధీ మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పైనేనని తేల్చిచెప్పారు. రాహుల్‌ ప్రధాని అయిన పది రోజుల్లో దేశవ్యాప్తంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కేంద్రంలో యూపీఏ-3 ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం హోదాతోపాటు కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వే జోన్‌, వందశాతం కేంద్ర నిధులతో పోలవరం తదితర విభజన హామీలన్నీ తు.చ. తప్పకుండా అమలవుతాయని చెప్పారు. పార్టీని వీడిన నేతలు త్వరలోనే తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.