ఎంపీ మురళీ మోహన్‌ కోడలికి కారుచౌకగా భూమి

Published: Sunday July 15, 2018
‘ముఖ్యమంత్రి చెప్పినట్లుగా రైతు రుణమాఫీ రైతులకు చేరలేదు’ అని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి విమర్శించారు. జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 212వ రోజు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి నుంచి పెదపూడి మండలం గొల్లల మామిడాడ వరకు సుమారు 7కిలోమీటర్ల మేర కొనసాగింది. గొల్లల మామిడాడ బహిరంగసభలో జగన్‌ మాట్లాడుతూ, దేశం మొత్తం జీఎస్టీ అమలులో ఉంటే రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అనపర్తి నియోజకవర్గంలో మాత్రమే తెలుగుదేశం టాక్స్‌ అమలులో ఉందన్నారు. నియోజకవర్గంలో లే అవుట్‌లకు రూ.2లక్షలు, వైన్‌షాపులకు రూ.2లక్షలు గుంజుతున్నారన్నారు. ధాన్యం బస్తాల రవాణా పేరుతో రూ.30 వసూలు చేసి అందులో పది రూపాయలు స్థానిక ఎమ్మెల్యేకు, రూ.20 కలెక్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ హుండీకి చేరుతున్నాయని విమర్శించారు.
 
నియోజకవర్గంలో బిక్కవోలు మండలం బలభద్రపురంలో 32 ఎకరాల ప్రభుత్వ భూమిని రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్‌ కోడలికి ప్రభుత్వం ఽఇచ్చేసిందన్నారు. ఎకరం 50లక్షలు ఉన్న భూమిని రూ.8లక్షలకు ఇచ్చారని అక్కడ 60మంది రైతులను తరిమి కొట్టారని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో రంగంపేట మండలం బాలవరంలో కేపీఆర్‌ సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దుచేసి, ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు కొట్టివేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నేటికీ ఆ హామీలు అమలుచేయలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే కేపీఆర్‌ సంస్థలకు ఇచ్చిన అనుమతులు రద్దుచేసి ఉద్యమ కారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామన్నారు. ఈ సందర్భంగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, 2014 కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అద్దంకి ముక్తేశ్వరరావులు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.