పది రోజుల్లో శ్రీశైలం డ్యామ్‌ నిండుతుంది: ముఖ్యమంత్రి

Published: Monday July 23, 2018

అమరావతి: రేపటి నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చే ప్రతినీటి చుక్కను సద్వినియోగం చేసుకుంటూ భూమినే జలాశయంగా మార్చుకోవాలన్నారు. గోదావరి జలాలతో కృష్ణా ఆయకట్టుకు నీళ్లిచ్చామని, సకాలంలో నాట్లు పడేలా చేశామన్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిస్తామన్నారు. గోదావరిలో ఇప్పటికే 419 టీఎంసీలు సముద్రంలో కలిసిందని, వంశధార, నాగావళికి వరద ప్రవాహం పెరిగిందన్నారు. మరో పదిరోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుందన్నారు.

ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అక్కడ పార్లమెంటులో తెదేపా ఎంపీలు పోరాటం చేస్తుంటే... ఇక్కడ అభివృద్ధి కోసం అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలన్నారు. ఒకవైపు హక్కుల కోసం పోరాటం, మరోవైపు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే కృష్ణానదిలోకి నీరు వస్తోందని, భూగర్భజలాలు పెంచుతున్నామన్నారు. అన్ని శాఖల కృషి ఫలిస్తోందని, సుస్థిర ఆర్ధికాభివృద్ధే తమ లక్ష్యం కావాలని సూచించారు. నాలుగేళ్ల కాలంలో వ్యవస్థలను పటిష్టంగా నిర్మించామన్నారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితి ఉన్న కారణంగా లోటు వర్షపాతం గల ప్రాంతాల్లో రెయిన్ గన్స్ వాడాలని సీఎం అధికారులను ఆదేశించారు. సకాలంలో మార్కెట్ జోక్యానికి తోతా మామిడి మరో ఉదాహరణగా సీఎం అభివర్ణించారు. ఇప్పటివరకు లక్ష టన్నుల మామిడిని సేకరించామని, ప్రభుత్వ స్పందనపై రైతుల్లో పూర్తిస్థాయిలో సంతృప్తి వచ్చిందన్నారు.