చంద్రబాబుపై విరుచుకుపడ్డ జగన్‌..

Published: Sunday July 29, 2018
సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిని భ్రమరావతిలా చేసి చూపిస్తారని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో శనివారం ఆయన మాట్లాడుతూ, మట్టి, ఇసుక మాఫియా, దళారుల దోపిడీతో పాలన అస్తవ్యస్తమైందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని యువతీయువకులకు హామీ ఇచ్చి నాలుగేళ్లపాటు కాలం వెళ్లదీశారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పినా చేసింది రైతుల వడ్డీలకే సరిపోయిందన్నారు. డ్వాక్రా మహిళలకు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయలేదన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. బెల్టు రద్దంటూ ప్రభుత్వం ప్రకటించిన తరువాత వీధివీధికీ బెల్టు షాపులు వెలిశాయని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో సీఎం చంద్రబాబు బీజేపీతో జతకట్టి నాలుగేళ్లు సంసారం చేసి ఏమీ సాధించలేకపోయారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారన్నారు.
 
మెట్టలో నీటి ఎద్దడి
మెట్టప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చేయలేకపోయారని జగన్‌ విమర్శించారు. పుష్కర కాలువ ద్వారా 14 పంపులతో నీరందించాల్సి ఉండగా 13పంపులతోనే నీరందిస్తున్నారన్నారు. దీనితో గండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏలేరు ఆధునికీకరణ పనుల ఆలస్యంతో ఆయకట్టు రైతులకు నీరందడంలేదన్నారు. పోలవరం పూర్తిపై చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని విమర్శించారు.
సమన్వయకర్తల సమావేశం రద్దు
జగ్గంపేటలో ఆదివారం జరగాల్సిన నియోజకవర్గ, పార్లమెంటు కో ఆర్డినేటర్ల సమావేశం అనివార్య కారణాలతో రద్దయింది. రెండు రోజులుగా ఈ సమావేశం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. వాయిదా పడటంతో అవన్నీ నిరుపయోగమయ్యాయి. వాయిదా పడిన సమావేశం ఎప్పుడు జరుగుతుందన్నదానిపై పార్టీ స్పష్టత ఇవ్వలేదు.