ఎవరెన్ని కుట్రలు పన్నినా టీడీపీతోనే బీసీలు
Published: Tuesday July 31, 2018

వచ్చే ఎన్నికల్లోనూ అధికారం ఎండమావేనని తెలుసుకుని.. కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్‌బాబు, శిద్ధా రాఘవరావు, ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ సోమవారం విరుచుకుపడ్డారు. ఎవరెన్ని చేసినా బీసీలు టీడీపీ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని జగన్ విస్పష్టంగా ప్రకటించడంతో కంగుతిన్న వైసీపీ నేతలు.. తమ నాయకుడు అలా అనలేదని చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవాచేశారు. ఏ హోదాతో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకుంటారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను నిలదీశారు. ‘బీసీలు టీడీపీకి పెట్టని కోట. వారు వేసిన పునాదిపైనే తెలుగుదేశం అభివృద్ధి చెందిందని స్వర్గీయ ఎన్టీఆరే అన్నారు.
కాపు రిజర్వేషన్‌కు టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. రెండు వర్గాల్లో ఎవరికి నష్టం కలగకూడదనే జస్టిస్ మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి.. నివేదికను అసెంబ్లీలో ఆమోదించి.. ఢిల్లీకి పంపాం. బీసీలకు, కాపులకు మధ్య చిచ్చు పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. అవినీతిలో జగన్, నటనలో పవన్ సూపర్‌స్టార్స్’ అని అయ్యన్న సోమవారం గుంటూరులో మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని తమ నాయకుడు చెప్పలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అనడం విడ్డూరంగా ఉందని చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో అన్నారు. జగన్ ఏం చెప్పారో కాపులందరికీ అర్థమైందన్నారు. పాదయాత్ర ముగిసేలోపు జగన్‌కు మతిభ్రమించడం ఖాయమని ప్రత్తిపాటి గుంటూరులో విమర్శించారు.
ఏ హోదాతో రాజధాని అమరావతిని అడ్డుకుంటారని పవన్‌ను ప్రశ్నించారు. కేంద్రం ఆయన్ను అడ్డుపెట్టుకుని రాజధాని రైతుల్లో చీలికకు యత్నిస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా బీసీలు సహా ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని మంత్రి శిద్ధా రాఘవరావు, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయా వర్గాలకు ఆయా పథకాల కింద ఎంత ప్రకటిస్తే అంతకు రెట్టింపు ఇస్తానని చెప్పడం తప్ప ఏ ఒక్క అంశంపైనా జగన్‌కు అవగాహన, చిత్తశుద్ధి లేవని సోమిరెడ్డి ఒంగోలులో విమర్శించారు. పింఛన్ రూ.2వేలు ఇస్తానని, కాపు కార్పొరేషన్ బడ్జెట్ రెట్టింపు చేస్తానన్నారని.. ఆయన చేసే వాగ్దానాలను అమలు చేయాలంటే ఏకంగా ఢిల్లీనే అమ్మేయాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ట్వీట్లు చేస్తూ కాలక్షేపం చేసే పవన్‌కు, పాదయాత్ర పేరుతో జగన్‌కు సీఎం కుర్చీపైనే ఆరాటమని కొల్లు రవీంద్ర ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై టీడీపీ ఎంపీలు పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే.. వైసీపీ ఎంపీలు రాజ్యసభలో ఎందుకు ప్రస్తావించడంలేదని శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ సచివాలయంలో ప్రశ్నించారు.

Share this on your social network: