25 ఎంపీలను ఇవ్వండి.. మా సత్తా చూపిస్తాం

Published: Wednesday August 01, 2018
వచ్చే ఎన్నికల్లో ప్రజలతో తప్ప ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోబోమని కాంగ్రెస్‌ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఊమెన్‌చాందీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి తమ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, 25 ఎంపీలనూ గెలిపిస్తే తమ సత్తా చూపుతామన్నారు. అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాహుల్‌ గాంధీ సిద్ధంగా ఉన్నారని చాందీ చెప్పారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ముఖాముఖి సంభాషించారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ, వైసీపీల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పూర్తిగా మోసగించిందని దుయ్యబట్టారు.
 
నాలుగేళ్లు ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... ప్రత్యేకహోదా గురించి ఏనాడూ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చాక హోదా గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక అంశంలో అధికార పార్టీ విఫలమైతే అది అమలులోకి వచ్చేలా ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయాలని, జగన్‌ పార్టీ ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని ఊమెన్‌చాందీ ఆక్షేపించారు. ప్రతిసారీ బంద్‌కు పిలుపునిస్తుందే తప్ప, హోదా సాధనకు వైసీపీ చేసిన పోరాటాలేవీ లేవన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయంలో తొలుత సానుకూలంగా స్పందించిన జగన్‌... తర్వాత మాట మార్చారని ఆయన విమర్శించారు.
 
పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బీజేపీతో జగన్‌ దొంగ కాపురం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీడబ్ల్యూసీలో తీర్మానం చేశారని, కాంగ్రెస్‌ దానికి కచ్చితంగా అమలు చేసి తీరుతుందని చెప్పారు. కాగా, కార్యకర్తల సమావేశంలో జేడీ శీలం మాట్లాడుతూ వైసీపీ తీరును ఎండగట్టారు. ‘ఎస్సీ, ఎస్టీలంతా నా వెనుకే ఉంటున్నారు అని జగన్‌ అనుకుంటున్నారు. ఆర్‌ఎస్ఎస్ తో అంటకాగుతున్న బీజేపీతో జగన్‌ దోస్తీ చేస్తారు. అంటే తనను నమ్మిన వారిని ఇష్టం ఉన్నా, లేకపోయినా నట్టేట్లో ముంచడానికే కదా?’ అని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ ను నమ్ముకుంటేనే ఏ వర్గానికైనా మద్దతు దక్కుతుందని శీలం చెప్పారు.