విపక్ష సభ్యుల ఓట్లన్నీ సీఎం రమేశ్
Published: Tuesday August 07, 2018

పార్లమెంటులో ప్రతిష్ఠాత్మకమైన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుల ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి! బీజేపీకి షాకిచ్చాయి! విపక్షాల ఐక్యతతో తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేశ్ అత్యధిక ఓట్లతో పీఏసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో ఎవరికీ రానన్ని ఓట్లు రమేశ్‌కు దక్కాయి. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో కేవలం ఆరుగురు సభ్యులే ఉండగా.. విపక్ష సభ్యులంతా అండగా నిలవడంతో రమేశ్‌కు 106 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్, వైసీపీ కూడా రమేశ్‌కే మద్దతు పలకడం విశేషం! ఇక విశ్వాసపరీక్షలో మోదీ సర్కారుకు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే కూడా ఝలక్ ఇచ్చింది. మొత్తం 13 మంది సభ్యులూ రమేశ్‌కే ఓటేయడం గమనార్హం. సోమవారం మధ్యాహ్నం పార్లమెంటుపీఏసీకి చెందిన రెండు సీట్లకు జరిగిన ఓటింగ్‌లో కాంగ్రెస్, అన్నాడీఎంకే, వామపక్షాలు, టీఆర్‌ఎస్, వైసీపీ, బీజేడీకి చెందిన ఎంపీలందరూ రమేశ్‌కు అండగా నిలబడడంతో అత్యధిక ఓట్లతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి భూపేంద్ర యాదవ్‌కు 69 ఓట్లే లభించాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు కేవలం 26 ఓట్లు రావడంతో ఆయన ఘోరంగా ఓడిపోయారు.
రమేశ్ ఎంపిక ప్రతిపక్షాల ఐక్యతకు నిదర్శనమని, ఇదే స్ఫూర్తి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపిక విషయంలోనూ కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మోదీ, అమిత్ షాలకు కుడి భుజమైన భూపేంద్ర యాదవ్‌కు బీజేపీ సంఖ్యాబలం కంటే ఒక్క ఓటు కూడా అధికంగా రాలేదు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తమ సభ్యులతో మాట్లాడి ఓటింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పినప్పటికీనలుగురు సభ్యులు గైర్హాజరైనట్లు తెలుస్తోంది.
అమిత్ షా స్వయంగా వచ్చి భూపేంద్ర యాదవ్ కోసం ఓటు వేశారు. మరోవైపు రమేశ్‌ను పోటీ నుంచి విరమింపజేయాలని బీజేపీ నేతలు శాయశక్తులా ప్రయత్నించారు. ఇప్పటికే పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నందున పీఏసీ సభ్యుడిగా పోటీ చేయకూడదని సూచించారు. అయితే రమేశ్ పట్టు వీడకపోవడమే కాక, మొత్తం ప్రతిపక్ష సభ్యులందర్నీ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం ఓటింగ్‌లో పాల్గొని రమేశ్‌కు మద్దతిచ్చారు.

Share this on your social network: