మోదీకి భయపడి దళితులకు జగన్‌

Published: Thursday August 09, 2018
‘‘మిస్టర్‌ పవన్‌కల్యాణ్‌... సినిమా హీరోలంతా సీఎంలు కాలేరు. సీఎం కావాలంటే ముందుగా ప్రజల హృదయాల్లో స్థానం పొందాలి. వారి ప్రేమాభిమానాలను అందుకోవాలి. అది మీ వల్ల కాదు. అన్న ఎన్టీఆర్‌కే అది సాధ్యమైంది. మీకు సీఎం సీటు దక్కదు’ అని టీడీపీకి చెందిన దళిత మంత్రులు జవహర్‌, నక్కా ఆనంద్‌బాబు, ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య, ధ్వజమెత్తారు.
 
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని షెడ్యూల్‌ 9లో పెట్టి, ఆ చట్ట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌తో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన దళిత, గిరిజన కవాతులో వారు పాల్గొన్నారు. మంత్రులతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు సాగారు. కవాతు సందర్భంగానూ, ఆ తరువాత జరిగిన సభలోనూ వర్ల రామయ్య, ఆనంద్‌బాబు, జవహర్‌ ప్రసంగించారు.
 
 
‘‘దేశంలో సగటున రోజుకి ఆరుగురు దళిత మహిళలపై అత్యాచారం, ప్రతి 15 నిమిషాలకు ఒక దాడి జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో దళిత, గిరిజనులకు రక్షణగా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం వెనుక ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హస్తం కచ్చితంగా ఉంది. ఈచట్టాన్ని రక్షించుకోవడానికి జరిగిన ఉద్యమంపై కాల్పులు జరిపి, 12 మంది దళితులను బలిగొన్నారు’’ అని వారు ధ్వజమెత్తారు. అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నా ప్రతిపక్ష నేత జగన్‌ స్పందించకపోవడం దారుణమన్నారు.
 
ప్రధాని మోదీకి ఎదురుతిరిగితే జైలు తప్పదన్న భయంతోనే, దళితులకు జగన్‌ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై చేసే పోరాటంలో చంద్రబాబుదే గెలుపని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ అన్నారు. ప్రత్యేకహోదా, విభజన హామీలు, రైల్వే జోన్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టానికి ఆర్డినెన్స్‌ను సీఎం నాయకత్వంలో సాధించి తీరుతామన్నారు.