ఇళ్ల రుణ బకాయిలు రద్దు....నర్సీపట్నం సభలో జగన్‌ హామీ

Published: Sunday August 19, 2018

రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం అవినీతిమయంగా మారిందని, నిరుపేదలను అప్పులపాలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. విశాఖపట్నం జిల్లాలో శనివారం ఉదయం నాతవరం మండల సరిహద్దు నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్‌... మెట్టపాలెం జంక్షన్‌, బయ్యపురెడ్డిపాలెం, బలిఘట్టం మీదగా నర్సీపట్నం చేరుకున్నారు. పట్టణంలోని శ్రీకన్య కూడలి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిరుపేదలపై రుణభారం లేకుండా పక్కా గృహాలను మంజూరుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మునిసిపాలిటీల్లో చేపడుతున్న పక్కా గృహాల నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.మూడు లక్షల రూపాయలు సబ్సిడీగా ఇస్తుండగా, మరో రూ.మూడు లక్షలు బ్యాంకు రుణంగా మంజూరు చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇంటి స్థలం, ఇసుక, సబ్సిడీ ధరకు సిమెంట్‌ ఇస్తూ కూడా ఒక్కో చదరపు అడుగుకి రూ.2వేలకు పైగా వసూలు చేస్తున్నారన్నారు. దీనివల్ల లబ్ధిదారులు జీవితకాలం ఇంటి రుణ బకాయిలను కట్టాల్సి వచ్చేలా ఉందన్నారు. అయితే ప్రజలు టీడీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లను వద్దనకుండా తీసుకోవాలని, దేవుడు దయ తలచి వైసీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల రుణ బకాయిలన్నింటినీ రద్దు చేస్తామని జగన్‌ ప్రకటించారు. టీడీపీ పాలన మొత్తం మోసం, అబద్ధాలు, అన్యాయం, అవినీతితో నడుస్తోందని, చెడిపోయిన ఇటువంటి రాజకీయ వ్యవస్థను మార్చాలంటే వైసీపీకి అధికారం ఇవ్వాలని కోరారు. మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, మంత్రి ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. వర్షం పడుతుండడంతో జగన్‌ తన ప్రసంగాన్ని కేవలం 20 నిమిషాల్లో ముగించారు.