కేబినెట్‌లోకి ఒకరా.. ఇద్దరా?

Published: Wednesday September 05, 2018
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం పొందబోయే అదృష్టవంతులు ఒకరా... ఇద్దరా? తెలుగుదేశం పార్టీ వర్గాల్లో దీనిపై ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావు రాజీనామాతో రాష్ట్ర మంత్రివర్గంలో రెండు ఖాళీలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక ఖాళీని ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వారితో భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంత్రివర్గంలో ప్రస్తుతం ఎస్టీలు లేరు. అందువల్ల ఆ వర్గానికి కూడా చోటిస్తే బాగుంటుందని కొందరు సీనియర్లు సూచించారు. తన మనసులో ఏమనుకుంటున్నారో ఆయన ఇంకా బయటకు చెప్పలేదు. గత ఎన్నికల్లో ఎస్టీల నుంచి టీడీపీ తరపున పోలవరంలో ముడియం శ్రీనివాసరావు ఒక్కరే గెలిచారు. తర్వాత వైసీపీకి చెందిన ఎస్టీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి టీడీపీలోకి వచ్చారు. అదే వర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి టీడీపీ ఎమ్మెల్సీ అయ్యారు. ఎస్టీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే ముడియం, సంధ్యారాణిల్లో ఒకరికి చోటు దక్కవచ్చని అంటున్నారు.
 
ఇంకోవైపు.. ముస్లిం మైనారిటీల్లో మంత్రి పదవి ఎవరికి దక్కుతోందనన్న చర్చ పార్టీలో నడుస్తోంది. ఇద్దరే రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒకరు శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ కాగా.. మరొకరు మండలిలో ప్రభుత్వ విప్‌ ఎంఏ షరీఫ్‌. ఎమ్మెల్యేలుగా జలీల్‌ ఖాన్‌, చాంద్‌బాషా ఉన్నా వారిద్దరూ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. కాగా.. అసెంబ్లీ సమావేశాల తర్వాతే విస్తరణ ఉంటుందని అంటున్నారు. గురువారం (6వతేదీ) నుంచి సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. 15 లేదా 16వ తేదీ వరకు ఇవి జరుగుతాయి. ఆ తర్వాతే విస్తరణ ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. కాగా.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం బుధవారం జరుగనుంది. తెలుగుదేశం శాసనసభాపక్ష భేటీతో కలిపి దీనిని నిర్వహిస్తారు. గ్రామదర్శిని..గ్రామవికాసం కార్యక్రమాన్ని ఈ సందర్భంగా సమీక్షిస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, వర్తమాన రాజకీయ అంశాలు, ఎన్నికల ముంగిట పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చ జరుగుతుంది.