రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా అభయహస్తం

Published: Friday October 05, 2018
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన ‘ఇంటింటా కాంగ్రెస్‌ అభయహస్తం’ కార్యక్రమానికి వస్తున్న స్పందన ఆ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తోంది. దీంతో ఈ నెలరోజులూ పెద్దఎత్తున దీనిని నిర్వహించి ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం జోరుపెంచింది. జిల్లాల్లో పర్యటిస్తున్న నేతలు.. ఈ కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళ్తూనే స్థానిక నేతలతో సమావేశమై.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రైతులు, డ్వాక్రా మహిళలకు రెండు లక్షల రూపాయల దాకా రుణ మాఫీ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
 
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బుధవారం కృష్ణా జిల్లాలో ఇంటింటా కాంగ్రె్‌సలో పాల్గొన్నారు. గురువారం కడప జిల్లా బద్వేలులో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పర్యటించారు. ఇంటింటా కాంగ్రె్‌సలో పాల్గొన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. గతంతో పోల్చితే.. కాంగ్రెస్‌ పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా చెబుతున్నాయి. నెల రోజుల పాటు ఇంటింటా కాంగ్రెస్‌ జరిపితే అభయహస్తం కార్యక్రమం మరింత ఊపు ఇస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
 
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెసే: రఘువీరా
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి హోదాలో రాహుల్‌గాంధీ ప్రత్యేక హోదాపై తొలి సంతకం.. రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీపై మలి సంతకం చేస్తారని రఘువీరారెడ్డి బద్వేలులో తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.బీజేపీ, టీడీపీ అవినీతిలో కూరుకుపోయాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సంవత్సరానికి 4 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ మాదిరిగా బీసీ మైనారిటీ సబ్‌ప్లాన్‌ తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కాంగ్రె్‌సను ప్రజలు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, సీనియర్‌ నేత తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు