ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నికల్లో కలకలం

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓట్లకు తలెత్తిన డిమాండ్ సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి ఓటు వేస్తే రూ.కోటి ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని న్యాయవాద వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఆఫర్లపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఏసీబీతో విచారణ జరిపించాలని ఆ ఫిర్యాదుల్లో కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ బార్ కౌన్సిల్‌కు 25 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఇరవై మూడున్నర వేల మంది న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొనడం ద్వారా ఈ పాతిక మందిని ఎన్నుకొన్నారు. ఈ పాతిక మంది కలిసి బార్ కౌన్సిల్ కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో బార్ కౌన్సిల్ చైర్మన్ పదవికి భారీ డిమాండ్ ఏర్పడింది. బార్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎన్నికైన వారికి ఐదేళ్లపాటు పదవీకాలం ఉంటుంది. కొన్ని అంశాల్లో బార్ కౌన్సిల్‌కు విశేష అధికారాలుంటాయి. న్యాయవాదుల సంక్షేమ నిధి మంజూరు, న్యాయవాదుల దుష్పవర్తన ఆరోపణలపై నిర్ణయాధికారం, న్యాయ కళాశాలలపై పర్యవేక్షణ వంటివి ఇందులో ఉన్నాయి.

Share this on your social network: