మాకు ఒకే రోజు రెండు ‘ప్రమాదాలు’ అయినా రాజకీయం చేయలేదు
Published: Saturday November 24, 2018

విపక్ష నేత జగన్ కోడికత్తిపై రాద్ధాంతం, రాజకీయం చేశారు. కానీ, నేను అలా చేయను. నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టింది. వాహనంలోని 8 మంది గాయపడ్డారు. మరికొన్ని గంటల్లోనే హైదరాబాద్‌లో మా నాయకుడు నాదెండ్ల మనోహర్ వాహనాన్ని కూడా ఇసుక లారీ కొట్టింది. మేం జగన్‌లా గోల చేయలేదు’’ అని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒక కోడి కత్తి గుచ్చినందుకు గుచ్చారో... గుచ్చారో... అని జగన్ గోల చేశారన్నారు. ‘వచ్చి పోరాటం చేయండి. బయటకు వచ్చి తోలు తీయండి. ఆ ధైర్యం మీకు లేదు’ అని జగన్‌ను ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శుక్రవారం ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ‘‘జగన్‌కు సమస్యలు పట్టవు. ఆయన చట్టసభలకు వెళ్లరు. ఎమ్మెల్యేలను కాపాడుకోని జగన్ పక్కకు తప్పుకోవాలి. మేం వస్తాం. జగన్‌లా భయపడుతూ రోడ్లమీద తిరిగే వ్యక్తిని కాదు. నేను జగన్‌లా పారిపోను’’ అని పవన్ పేర్కొన్నారు.
జగన్‌తో బాబు కలవొచ్చు!
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాదు తరలించి అంత్యక్రియలు మధ్యలోనే వదిలేశారని పవన్ పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు తెలంగాణ వదిలి ఏపీకి వచ్చేశారు. చంద్రబాబు, జగన్ తెలంగాణలో తిరగలేరు. ఎక్కడైనా తిరిగే సత్తా నాకు మాత్రమే ఉంది. తెలంగాణలో ఆంధ్రులకు అండగా ఉన్నది నేనే’’ అని పవన్ తెలిపారు. చంద్రబాబు భవిష్యత్తులో జగన్‌తో పొత్తు పెట్టుకోవడానికి కూడా వెనుకడుగు వేయరని ఎద్దేవా చేశారు. ‘‘పంచభూతాలను దోచుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు చింతకాయల్లా రాలిపోతారు. టపాకాయల్లా పేలిపోతారు. సీఎంకి వయసు పెరిగిపోయింది. పాలనకు పని చెయ్యరు’’ అని అన్నారు. నాదెండ్ల మనోహర్‌కు భద్రత కల్పించాలని నెలక్రితం దరఖాస్తు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ విమర్శించారు.
తమ పార్టీ నేతలకు ఏమైనా జరిగితే దానికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘‘ఐదురోజుల క్రితం రాజానగరం యాత్రకు వెళ్తా ఉంటే.. ఇసుక లారీ వచ్చి... నా కారును దాటి కాన్వాయ్‌ని గుద్దింది. అదే రోజున హైదరాబాద్‌లో దిగి ఇంటికెళ్తుండగా నాదెండ్ల మనోహర్ కారును మరో ఇసుక లారీ గుద్దేసింది. ఇది యాదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో అన్నది పోలీసులకే వదిలేశాం. బాబూ లోకేశ్... మీరు పార్టీని నడిపే వ్యక్తి. ఇలాంటి కుతంత్రాలకు పాల్పడితే ఎలా? పోలీస్ శాఖను, డీజీపీని వేడుకుంటున్నా... ఒకసారి అశాంతి వస్తే ఎవరి చేతుల్లో ఉండదు’’ అని పవన్ హెచ్చరించారు.

Share this on your social network: