ఎవరో వదిలిన బాణాన్ని కాను
Published: Tuesday November 27, 2018

నేను ఎవరో వదిలిన బాణాన్ని కా దు. నేనే ఒక విల్లును. నేనే బాణాలను సంధిస్తాను’’ అని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ‘మోదీ వదిలిన బాణం లక్ష్మీనారాయణ’ అని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని 13 జిల్లాల్లో పర్యటించానని, ఆ అనుభవంలో చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పారు. సోమవారం ఆయన అభిమానులు, పలు రంగాల మేధావులతో సోమవారం పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సమావేశమయ్యారు. కొత్తపార్టీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ పార్టీలోనూ చేరబోనన్నారు. స్వతంత్రంగానే ముందుకు సాగుతానని ప్రకటించారు. లోక్‌సత్తాలో చేరాలని జయప్రకాశ్ నారాయణ కోరారని, అందరితో చర్చించాకే ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, ఆప్ నేతలు కూడా ఆహ్వానించారని తెలిపారు. ఏపీ ఎన్నికలతో పాటు, తెలంగాణలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. 1960 నాటి చట్టాలకు కాలానుగుణంగా మా ర్చులు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు విజయం సాధించక పోవచ్చునని, ఎప్పటికైనా కచ్చితంగా గెలుస్తానన్నారు. ఏపీ సర్కారు నవ నిర్మాణ దీక్షలు, పుష్కరాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. జగన్, పవన్ కల్యాణ్‌తో కలిసి పని చేస్తారా? అని అడగ్గా, తన విధివిధానాలు నచ్చి ముందుకు వచ్చే వాళ్లతో పని చేస్తానని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో శూన్యత చాలా ఉందన్నారు. రామమందిరం నిర్మాణ అంశం కోర్టు పరిధిలో ఉందని, తీర్పు కోసం తాను కూడా ఎదురు చూస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో పోలీసులు ఉన్నారని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, అలాంటప్పుడు జగన్‌పై దాడికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తాను పెట్టబోయే పార్టీని రెండు రాష్ట్రాలకే పరిమితం చేయబోమని, దేశవ్యాప్తం గా ఉండేలా చూస్తామని చెప్పారు. పార్టీని ప్రారంభించబోతున్నానని తెలిసి చాలా మంది తనకు ఫోన్లు చేశారని, డబ్బులు ఉన్నాయా? అని అడిగారని చెప్పా రు. అంతకంటే ఎక్కువ మంది ‘మేమంతా ఉన్నాం. మీరు ముందు నడవండి’’ అని స్వాగతించారని తెలిపారు. మహిళల జనాభా 50 శాతం ఉందని, వాళ్లకు 33 శాతం రిజర్వేషన్లు తక్కువేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆసక్తి ఉంటే ప్రశ్న అడిగిన మహిళా రిపోర్టరును తమ పార్టీ అభ్యర్థిగా నిలబెడతానన్నా రు. తన పార్టీకి ఇంకా ఎలాంటి పేరూ అనుకోలేదని, సలహాలూ, సూచనలూ ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఓటును అమ్ముకోవద్దన్న సందేశంతో రూపొందించిన పాటను, వీడియోను లక్ష్మీనారాయణ అభిమానులు ప్రదర్శించారు.

Share this on your social network: