మోదీ, బాబు, పవన్‌లను నమ్మొద్దు.. పాలకొండ సభలో జగన్ ధ్వజం
Published: Thursday November 29, 2018

‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటనను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో చెప్పారు. హోదా, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు, దుగరాజపట్నం పోర్టు ఇలా పలు అంశాలను పరిశీలిస్తామని మాత్రమే విభజన చట్టంలో ఉంది. అలా కాకుండా... స్పష్టమైన హామీ ఇచ్చి ఉంటే కోర్టుకైనా వెళ్లి వాటిని సాధించుకునే వాళ్లం’’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
నిజానికి... రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. విభజనతో నష్టపోయే ఏపీకి ఊరటనిచ్చేలా ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. కానీ... విభజన చట్టంలో ‘హోదాను పరిశీలిస్తాం’ అని ఉన్నట్లుగా జగన్ పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు తమ పార్టీని 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే... ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై సంతకం చేసి ఇచ్చే పార్టీకే మద్దతిస్తామని ప్రకటించారు. ‘అది కాంగ్రెస్ కావచ్చు. మరే పార్టీ అయినా కావచ్చు’ అన్నారు.
‘‘2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్ సహకరించారు. ఇప్పుడు ఆ ముగ్గురినీ నమ్మవద్దు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ఆనాడే చెప్పింది. ఇప్పుడు కూడా అదే చెబుతోంది. నాలుగున్నరేళ్లు బీజేపీతో కాపురం చేసిన వ్యక్తి ఇప్పుడుహోదా పేరుతో కాంగ్రె్‌సతో జతకట్టారు’ అని జగన్ విమర్శించారు. అధికారంలోకి వస్తే పేదవాడికి రూ.10 వేలు పింఛను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే సీఎం విమాన విన్యాసాలు, బోటు రేసులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ‘‘బీజేపీకి వ్యతిరేకంగా ఉండి గతంలో యూపీఏలో ఉన్నవాళ్లందరినీ ఆయన విమానంలో వెళ్లి కలిసి వస్తున్నారు. తానే వాళ్లందరినీ కలిపినట్లు బిల్డప్ ఇస్తున్నారు.
ఉదయం కర్ణాటకలో కుమారస్వామితో టిఫిన్, తర్వాత చెన్నైలో స్టాలిన్‌తో ఇడ్లీ సాంబార్, మధ్యాహ్నం కోల్‌కతాలో మమతాబెనర్జీతో భోజనం చేస్తున్నారు’ అని జగన్ ఎద్దేవా చేశారు. తితలీ తుఫానును ఒడిసా సర్కారు సమర్థంగా ఎదుర్కొందని తెలిపారు. ‘‘తుఫానుతో రూ.3,345 కోట్ల నష్టం సంభవించిందని కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఆయన మాత్రం ఈ నష్టంలో కనీసం 15 శాతం కూడా మంజూరు చేయలేదు. దేవుడి దయతో అధికారంలోకి వస్తే.. జగన్ అనే నేను.. తితలీ బాధితులందరికీ రూ.3,345 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల చేస్తా’’మన్నారు.

Share this on your social network: