ప్రైవేటు హాస్టల్లో దారుణం
Published: Friday March 01, 2019

పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు పక్క మండలానికి చెందిన బాలిక స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతూ, ఆ స్కూల్ హాస్టల్‌లోనే ఉంటోంది. ఆ బాలిక క్లాస్‌మేట్ అయిన ఓ విద్యార్థి, మరో విద్యార్థి పుస్తకం కోసం అంటూ ఆదివారం రాత్రి హాస్టల్‌కు వచ్చారు. బాలికపై తీవ్ర ఒత్తిడి తెచ్చి పైఅంతస్థులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
దారుణాన్ని బాధితురాలు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. దీంతో బాలిక తీవ్రమైన కుంగుబాటుతో మరుసటి రోజు స్కూల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే బాలిక ప్రమాదవశాత్తు పడిపోయిందంటూ స్కూల్ యాజమాన్యం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, కర్నూలులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం స్పృహలోకి వచ్చిన బాలిక జరిగిన దారుణాన్ని తన తాతకు చెప్పింది. ఆయన మనుమరాలిని ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ రామలింగమయ్య, ఎస్‌ఐ కేసు విచారిస్తున్నారు.

Share this on your social network: