సచివాలయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Published: Saturday July 27, 2019
గ్రామ, పట్టణ స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయనున్న సచివాలయాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం నోటిషికేషన్‌ విడుదల చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా చేరువ చేయడానికి గ్రామ సచివాలయాల్లో 95,088 మంది, పట్టణ వార్డు సచివాలయాల్లో 37,860 మంది కార్యదర్శులు అవసరమని పేర్కొంది. అంటే... మొత్తం 1,32,948 మంది అవసరం. అయితే, ఇప్పటికే ఆయా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని మినహాయిస్తే భర్తీ చేసే సంఖ్యలో మార్పు ఉండే అవకాశముందని తెలిపింది. వీటికి శనివారం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు పదో తేదీ వరకూ దరఖాస్తులకు గడువుంది. మరిన్ని వివరాలకు వీఎస్‌డబ్ల్యూఎస్.ఏపీ.జీవోవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రభుత్వం సూచించింది.
 
గ్రామాల్లో పోస్టులు...
పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్‌-5) పోస్టులు-7040, వీఆర్వో(గ్రేడ్‌-2)-710, ఏఎన్‌ఎం(గ్రేడ్‌-3)-9754, పశుసంవర్థక అసిస్టెంట్‌-9886, గ్రామ పిషరీస్‌ అసిస్టెంట్‌-794, గ్రామ ఉద్యానవన అసిస్టెంట్‌-4000, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్‌(గ్రేడ్‌-2)-6714, గ్రామ సెరికల్చర్‌ అసిస్టెంట్‌-400, మహిళా పోలీసు మరియు మహిళ, బాలల సంక్షేమ అసిస్టెంట్లు-11,158, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు(గ్రేడ్‌-2)-11,158, గ్రామ పంచాయతీ సెక్రటరీ(గ్రేడ్‌-6)డిజిటల్‌ అసిస్టెంట్లు-11,158, గ్రామ సర్వేయర్లు(గ్రేడ్‌-3)-11,158, సంక్షేమ మరియు విద్యా అసిస్టెంట్లు-11158 పోస్టులను భర్తీ చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. అవసరాన్ని బట్టి ఖాళీలు మారే అవకాశముందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
 
దరఖాస్తులు ఎలా..?
సచివాలయ పోస్టులకు అభ్యర్థులు ముందుగా వారి బయోడేటా వివరాలు వన్‌టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌(ఓటీపీఆర్‌) చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. సెప్టెంబరు మొదటి వారంలో పరీక్షలను ఆఫ్‌లైన్‌ విధానంలో చేపడతారు. ఇంగ్లీషు, తెలుగు మీడియంలో పరీక్షలుంటాయి. 2019 జూలై ఒకటో తేదీ నాటికి 18-42 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఇస్తారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పరీక్ష ఫీజు ఉండదు. ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200లు చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు పరీక్ష ఫీజు రూ.200, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200లు చెల్లించాలి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తుదారు ఏ జిల్లాలోనైనా పరీక్షలు రాసేందుకు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. వెసులుబాటు బట్టి కేంద్రాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. కమ్యూనిటీ, నేటివిటీ, జనన ధ్రువీకరణ పత్రం, నిరుద్యోగ డిక్లరేషన్‌, స్కూల్‌ స్టడీ సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రం, అంధులు, బధిరులు, వికలాంగులు, స్థానికత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
 
పట్టణాల్లో ఇలా...
రాష్ట్రంలోని మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో 3786 వార్డు సెక్రటేరియట్లకు కలిపి ఒక్కొక్కదానికి పదిమంది చొప్పున మొత్తం 37,860 మంది కార్యదర్శులను నియమించనున్నారు. వీరిలో ఇప్పటికే సంబంధిత బాధ్యతలు నిర్వహిస్తున్న 4,359 మంది ఉద్యోగులను మినహాయించి మిగిలిన 33,501 వార్డు సెక్రటేరియట్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎంపికైన కార్యదర్శులకు తొలి రెండేళ్లపాటు ప్రొబేషన్‌ పిరియడ్‌గా నెలకు రూ.15వేల కన్సాలిడేట్‌ వేతనం చెల్లిస్తారు. దీనిని విజయవంతంగా ముగించిన వారికి రెగ్యులర్‌ స్కేల్‌ అమలు చేస్తారు. సగటున 4వేల మందికి ఒక వార్డు సెక్రటరీ ఉంటారు.