పెథాయ్‌ తుఫాన్‌ తీసుకువచ్చిన చలి

Published: Friday December 21, 2018

పెథాయ్‌ తుఫాన్‌ తీసుకువచ్చిన తేమ ప్రభావం కోస్తాలో కొనసాగుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పగటిపూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో కూడా చలి కొనసాగుతున్నది. రాయలసీమ జిల్లాలు తప్ప కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు ఉత్తరాది గాలులతో రాత్రి సమయాల్లో కూడా చలి పెరిగింది. వెరసి కోస్తాలో చల్లటి వాతావరణం నెలకొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగేంత వరకు పగటిపూట చలి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. కాగా ఉత్తరాది గాలులతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆరోగ్యవరంలో 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో తమిళనాడుతోపాటు పొరుగునున్న నెల్లూరులో తేలికపాటి జల్లులు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.