ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ

Published: Saturday January 26, 2019
పబ్లిక్‌ పాలసీ రిసెర్చ్‌ పేరిట విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పూసపాటిరేగ మండలంలో సర్వే నిర్వహిస్తున్న యువకులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వారి దగ్గర ట్యాబ్‌లు లాగేసుకున్నారు. సర్వేల పేరుతో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. దీంతో విజయనగరం జిల్లాలో హైడ్రామా చోటుచేసుకుంది. కొందరు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సర్వే బృందాలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హోంమంత్రి చినరాజప్ప హెచ్చరించారు.
 
వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగలో సర్వే నిర్వహిస్తున్న యువకులను గురువారం వైసీపీ నాయకులు అడ్డగించారు. వారి ట్యాబ్‌లను లాగేసుకుని జిల్లా వైసీపీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను)కు అప్పగించారు. తమపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారని యువకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 8మంది వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం విజయనగరంలో మజ్జి శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసి తీసుకుని జామి పీఎ్‌సకు తరలించారు. 6 గంటలపాటు ఆయన్ని ప్రశ్నించారు. మధ్యాహ్నం స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.
 
మరోవైపు- à°† పార్టీ ప్రధాన కార్యదర్శి బొత్స సత్యనారాయణ సచివాలయంలోని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలను ట్యాబ్‌ల్లోకి అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. యువకుల దగ్గర స్వాధీనం చేసుకున్న రెండు ట్యాబ్‌లను ఈసీకి ఇచ్చామని, మరో 5 ట్యాబ్‌లను డీజీపీని కలిసి ఫిర్యాదు చేసి అందజేస్తామన్నారు. ఓటరు జాబితాలోని పేర్లను తొలగించడం ఎవరికి పడితే వారికి సాధ్యంకాదని వైసీపీ నేతలకు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ వారికి బదులిచ్చారు. సర్వేలను తాము ఇప్పుడే ఆపలేమని, ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత చేయకూడదని ఆయన అన్నారు.
 
కాగా, ‘ఎన్నికల సమయంలో ప్రజల నాడి తెలుసుకోవడం కోసం సర్వేలు చేసుకోవడం సహజం. ఎవరైనా చేసుకోవచ్చు. విజయనగరం జిల్లాలో సర్వే చేస్తున్న బృందాలపై వైసీపీ నేత బొత్స వర్గీయులు దాడి చేయడం దారుణం. అక్కడ కేసు నమోదు చేశాం’ అని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. సర్వే బృందాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆయన రాజమహేంద్రిలో హెచ్చరించారు.