ఏపీ బంద్‌ కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు

Published: Thursday February 08, 2018

ఏపీ బంద్‌కు కారణంగా గురువారం ఉదయం నుంచే నిరసనకారులు రోడ్లమీదకు వచ్చారు. తెల్లవారుజామునుంచే బస్సు డిపోలవద్ద ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ధర్నాలు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వామపక్షాలు ఏపీ బంద్‌కు పిలుపు ఇవ్వగా విపక్ష పార్టీ వైసీపీ మద్దతు తెలిపింది. నిరసన చేయాలని జనసేన కూడా పిలుపు ఇచ్చింది. మరోవైపు బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. బంద్ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. విద్యాశాఖ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. కాగా ఇవాళ జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్స్ ఈనెల 22కు వాయిదా వేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమతమవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దుకాణాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు.