కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా పవన్ అడుగులు

Published: Thursday February 08, 2018

విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని సాద్యాసాధ్యాల కోసం పవన్ అందరితో మాట్లాడుతారా అనే చర్చ సాగుతోంది. ఏపీ ప్రయోజనాల కోసం పవన్ మెట్టు ఎక్కేందుకైనా, దిగేందుకైనా సిద్ధంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలతో ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాశ్ నారాయణ వంటి వారితో కలుస్తానని చెప్పారు. అదే సమయంలో పార్టీలకు అతీతంగా జేఏసీ ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉద్యమించే అవకాశముందా అనే చర్చ సాగుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో లోపాలు, అబద్దాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. నేను ప్రజల పక్షం కానీ, పార్టీల పక్షం కాదన్నారు. కాకినాడ సభ తర్వాత తాను పోరాటం చేద్దామనుకున్నప్పటికీ వద్దని వారించారని చెప్పారు. తెలంగాణలో ఉద్యమం సమయంలో అంతర్గత విభేదాలు ఉన్నా కలిసి పోరాడారని చెప్పారు.
పదేపదే ప్రశ్నిస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ అధికార పార్టీలను వెనుకేసుకొస్తున్నారని విమర్శలు వస్తున్నాయని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... పవన్ స్పందించారు. ధీటుగా సమాధానం ఇచ్చారు. ప్రజలు వినలేని మాటలతో, పచ్చిబూతులతో తాను మాట్లాడలేనని, విమర్శించలేనని చెప్పారు. అలాంటి రాజకీయాలు నేను చేయలేనని స్పష్టం చేశారు.
మభ్యపెట్టే రాజకీయాల వల్ల యువతకు నష్టం జరుగుతోందని పవన్ చెప్పారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పోరాటం సాగాలన్నారు. విభజన హామీలు ఎంత వరకు అమలయ్యాయని ప్రశ్నించారు. ప్యాకేజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పడం లేదన్నారు. విభజన సమస్యలు మోడీకి చెప్పేందుకు తాను గాంధీ నగర్ వరకు వెళ్లానని చెప్పారు.