విభిన్న రాజకీయం..అనూహ్య వ్యూహాలు

Published: Friday May 24, 2019

గెలిచి తీరాలి! అధికారంలో నిలవాలి! దీనికోసం ఇన్నాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొత్తగా ఏదో చేయాలి! సంప్రదాయ రాజకీయం, బలానికి తోడుగా... విభిన్నమైన ‘దారులు’ వెతకాలి! వైఎస్‌ జగన్‌కు à°† దారి చూపించింది... ప్రశాంత్‌ కిశోర్‌. ఆయన రూపంలో ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి ‘కన్సల్టెన్సీ రాజకీయం’ రాజ్యమేలింది. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) ‘సక్సెస్‌ ట్రాక్‌’ ఏర్పరుచుకున్నారు. అదే పీకేను జగన్‌ తమ వ్యూహకర్తగా ఎంచుకున్నారు. అయితే... తమతో విభేదించిన చంద్రబాబును దెబ్బకొట్టేందుకు పీకేను వ్యూహకర్తగా నియమించుకోవాలని బీజేపీయే జగన్‌కు సూచించినట్లు చెబుతారు. బిహార్‌కు చెందిన పీకే ఐరాసలో ఎనిమిదేళ్లు పనిచేశారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు 2011లో ఆయన వ్యూహకర్తల బృందంలో పీకే చేరారు. 2012లో మోదీ గెలిచేందుకు ఆయన వ్యూహాలు దోహదపడ్డాయి. మోదీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా.. 2013లో సిటిజెన్స్‌ ఫర్‌ అకౌంటబుల్‌ గవర్నెన్స్‌ (సీఏజీ) అనే పబ్లిసిటీ-మీడియా సంస్థను స్థాపించారు. మోదీ కోసం వినూత్న ప్రచారాలు నిర్వహించారు. ‘చాయ్‌ పే చర్చ’ బాగా సక్సెస్‌ అయింది. ప్రధాని మోదీతో విభేదాలు తలెత్తాక పీకే.. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ చెంతకు చేరారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన్ను గద్దెనెక్కించడంలో విజయం సాధించారు. యూపీ, పంజాబ్‌లలో కాంగ్రెస్‌ విజయం కోసం పీకే సలహాలు అందించారు. పంజాబ్‌లో గెలుపుబాటలో నడిపించినా.. యూపీలో మాత్రం పీకే ఘోరంగా విఫలమయ్యారు.