ఈనెల 30దాకా వర్షాలే వర్షాలు

Published: Saturday July 27, 2019
 à°¬à°‚గాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా మారాయి. గురువారం రాత్రి నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి అవి కొన్నిచోట్ల భారీ వర్షాలుగా మారాయి. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు గోదావరి జిల్లాల్లో సార్వా పనుల్లో నిమగ్నమయ్యారు. భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలోని పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సార్వా సాగుభూముల్లో 430 హెక్టార్లలో వరినారుమళ్లు ముంపునకు గురయ్యాయి. 4,818 హెక్టార్లలో వరి నాట్లు మునిగాయి. à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో జిల్లాలోని యలమంచిలి మండలంలో అత్యధికంగా 97.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. గురువారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ వరరామచంద్రపురం మండలంలో అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వి.ఆర్‌.పురం, చింతూరు ప్రధాన రహదారిలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 
జగ్గంపేట, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. అత్యధికంగా అల్లవరం మండలంలో 121. 2 మిల్లీమీటర్ల వర్షం పడింది. కృష్ణాజిల్లాలో మెట్ట ప్రాంతాలు, కాల్వ చివరి భూముల రైతులు చినుకు రాకతో ఎక్కువ సంతోషంగా ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పలుచోట్ల కురిసింది. తోట్లవల్లూరులో అత్యధికంగా 62.2మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, జగ్గ్గయ్యపేటలో అత్యల్పంగా 2.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 21.2 మిల్లీ మీటర్లుగా నమోదైంది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం పట్టణంలో ఉదయం నుంచి వర్షాలు పడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత కొద్దిరోజులుగా వర్షాలు లేక వరినారుమడులు ఎండిపోతున్న తరుణంలో ఈ వర్షాలు ఊపిరినిచ్చాయి. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు సిటీలో రోజంతా వాతావరణం ముసురుపట్టి, అక్కడక్కడా జల్లులు పడ్డాయి.
 
కాగా, శుక్రవారం ఉదయం నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చింతూరులో తొమ్మిది, ఆచంటలో ఎనిమిది, ముంచంగిపుట్టు, నర్సీపట్నంలలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నెల 30 వతేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.