బాబు ఇల్లు మునిగితే పరిస్థితేంటి?

Published: Saturday August 17, 2019
చంద్రబాబు నివాసం వద్ద జల మట్టం పెరుగుదలపై నీటి పారుదల శాఖ డ్రోన్ల సహాయంతో సమీక్ష చేస్తోందని మంత్రి అనిల్‌ కుమార్‌ తెలిపారు. తెలుగుదేశం నేతలు ప్రతి అంశాన్నీ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి వరద యాజమాన్య విజదానం తెలియడం లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఒకేసారి నీటిని విడుదల చేసి ఉంటే.. శుక్రవారం నాటికి ఒకేసారి 12 లక్షల క్యూసెక్కుల జలాలు దిగువకు వచ్చేవని.. అదే జరిగితే.. చంద్రబాబు నివాసం ముంపునకు గురయ్యేదని, అప్పుడు పరిస్థితేమిటని ప్రశ్నించారు. ‘చంద్రబాబు పాలనలో వరద యాజమాన్య విధానాన్ని అమలు చేసేందుకు ఆస్కారమే లేదు. ఆయన హయాంలో వానలు లేవు. వరదలూ రాలేదు. ఎగువన ఉన్న రాష్ట్రాల్లోనూ కరువు నెలకొంది’ అని చెప్పారు.
 
బాబు నివాసం ఒకవేళ ముంపునకు గురయితే.. ప్రతిపక్షనేత నివాసాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తారన్నారు. చంద్రబాబు నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. వరద ముంపును చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వరద ప్రవాహం భారీగా ఉందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లారని, అక్కడ నుంచి నీచ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వరదలో తన నివాసం మునక తప్పదని తెలిసిన చంద్రబాబు, ఆయన కుటుంబం.. ఇక్కడ ప్రజలను వదిలి హైదరాబాద్‌కు పారిపోయారని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
 
వరద మునక తప్పదని తెలిసిన చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ కాన్వాయ్‌ను మంగళగిరిలోని హ్యాపీక్లబ్‌కు తరలించడం.. మొదటి అంతస్తులోని సామాన్లను రెండో అంతస్తులోకి మార్చడం, వరద నుంచి కాపాడుకునేందుకు ఇసుక బస్తాలు సమకూర్చుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఐదేళ్లు నీటిపారుదల శాఖా మంత్రిగా పని చేసిన దేవినేని ఉమ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. డ్రోన్ల ద్వారా కరకట్ట, ఇతర ముంపు ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంటే టీడీపీ అనవర రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు.