రైతుల ఉసురు తీసిన పంట నష్టాలు

Published: Sunday August 25, 2019
పంట నష్టాలు ఇద్దరు రైతుల ఉసురుతీశాయి. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కడప జిల్లా వేపంల్లె మండలం నాగూరుకు చెందిన నాగెళ్ల సంజీవరెడ్డి(44)కి మూడెకరాల పొలం ఉంది. భార్య, ఇద్దరు పిల్లులున్నారు. కొన్నేళ్లుగా వరుస పంట నష్టాలతో అప్పులపాలయ్యాడు. బోర్లు వేసినా నీరు పడలేదు. నాలుగేళ్ల క్రితం పెద్దకొడుకు శివారెడ్డి వైద్యానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా కొడుకు బతకలేదు. మొత్తం అప్పులు రూ.13 లక్షలకు చేరాయి. ఓవైపు పంట చేతికి రాకపోవడం, మరోవైపు అప్పులకు వడ్డీలు పెరగడంతో జీవనానికి కూడా ఇబ్బందిగా మారింది. కొద్ది రోజుల నుంచి సంజీవరెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. శనివారం తన పొలంలో విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
 
స్థానిక రైతులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వేంపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్‌ గ్రామంలో సురేంద్ర బాబు(40)కు నాలుగెకరాల పొలం ఉంది. మూడేళ్ల నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి, ఇతర పంటలు సరిగా పండలేదు. పంట సాగుకు చేసిన అప్పులు రూ.6లక్షల వరకు చేరాయి. వాటిని తీర్చేదారిలేక తీవ్ర మనస్తాపంతో సురేంద్రబాబు శుక్రవారం రాత్రి ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.