ముంచెత్తిన విషాదం.. గోదావరి నదిలో పడవ ప్రమాదం

Published: Monday September 16, 2019
భద్రాచల రాముడి దర్శనానికి బయలుదేరిన ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. తూర్పుగోదావరి జిల్లా కుచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో దగ్గర బంధువువలైన పన్నెండు మంది గల్లంతు అయ్యారు. ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. మిగిలిన వారి క్షేమసమాచారాలు తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు, పెద్దలు కలిపి మొత్తం 13 మందిని గోదారమ్మ తనలోకి తీసుకువెళ్లిపోయింది. వీరిలో బోసా లక్ష్మి(55) ప్రాణాలతో బయటపడగా, మిగిలిన పన్నెండు మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారంతా క్షేమంగా ఒడ్డుకు చేరాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. అంతా దగ్గర బంధువులు కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
 
నగరంలోని రామలక్ష్మికాలనీకి చెందిన మదుపాడ రమణబాబు(35) వృత్తిరీత్యా డ్రైవర్‌. ఖాళీ సమయంలో కేటరింగ్‌ పనులకు కూడా వెళుతుంటాడు. రమణబాబుకు దైవ చింతన ఎక్కువ. ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళుతుంటాడు. అదేమాదిరిగా కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం రామయ్య దర్శనానికి ఆదివారం బయలుదేరి వెళ్లారు. రమణబాబు(35)తోపాటు అతని భార్య అరుణకుమారి(26), కుమారుడు అఖిలేష్‌(7), కుమార్తె కుషాలి(5), అనకాపల్లిలోని గోపాలపురంలో ఉంటున్న అతని అత్త భూసాల లక్ష్మి(55), ఆమె మనవరాలు భూసాల సుస్మిత(4), మరిది కూతురు పూర్ణ(23), చిన్న అత్త దాలెమ్మ(52), ఆరిలోవలో ఉంటున్న రమణబాబు పెద్ద అక్క అప్పలనర్సమ్మ(45), ఆమె మనుమరాళ్లు, గీతావైష్ణవి(8), అనన్య(4), వేపగుంటలో ఉంటున్న రమణబాబు చిన్నక్క బొండా లక్ష్మి అలియాస్‌ పైడికొండ(37), ఆమె కుమార్తె పుష్ఫ(13)లు ఆదివారం ఉదయం 4 à°—à°‚à°Ÿà°² సమయంలో బయలుదేరి వెళ్లారు.
 
రాజమండ్రిలో దిగిన తరువాత గోదావరిలో ప్రయాణిస్తూ పర్యాటక ప్రాంతాలను వీక్షించాలని భావించి బోటు ప్రయాణం సాగించారు. ఇదే వారి పాలిట పెను శాపంగా మారింది. హాయిగా సాగిపోతున్న ప్రయాణంలో కుదుపులాంటి విషాదం. బోటు ప్రమాదంతో పరిస్థితి తలకిందులైంది. బోటు మునిగి పోవడంతో కుటుంబ సభ్యులు చెల్లాచెదురైపోయారు. వీరిలో బోసా లక్ష్మి మాత్రమే ప్రాణాలతో ఒడ్డుకు చేరగలిగింది. మిగిలినవారి ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంలో గల్లంతైన వారి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.