21వేల ఎకరాల్లో వరి పంట మునక

Published: Saturday October 26, 2019

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలు రైతును నిలువునా ముంచాయి. వేలాది ఎకరాల్లో పంట వాన నీటిలో నానుతుండటంతో అన్నదాతలు భోరుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వీటి ప్రభావంతో వేలాది ఎకరాలు నీటమునిగియాయి. పొట్ట దశలో ఉన్న వరి పంట నీటిలో నానిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 13వేల ఎకరాల్లో వరిపంట నీట మునిగినట్టు ప్రాథమిక అంచనా. బూర్జ మండలానికి ప్రధాన ఆయకట్టుగా ఉన్న బొమ్మిక జలాశయానికి à°—à°‚à°¡à°¿ పడటంతో సమీప పంటపొలాలన్నీ నీటమునిగాయి. వంగర మండలం సంగంలోని సంగమేశ్వరాలయం వరదనీటిలో మునిగిపోయింది. పలు ప్రభుత్వ పాఠశాలల ఆవరణలు వర్షపు నీటితో నిండిపోయాయి. గార మండలం బందరువానిపేట ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంతో భోజనం పేట్లను చేత్తో పట్టుకొని విద్యార్థులు వర్షపు నీటిలో తరగతి గదులకు చేరుకోవాల్సి వచ్చింది. విజయనగరం జిల్లాలో భారీ వర్షాలకు రూ.25కోట్ల విలువైన పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 8వేల ఎకరాల్లో వరి, 1260 ఎకరాల్లో మొక్కజొన్న, 2750 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నాయి. భారీవర్షాలకు విశాఖ జిల్లాలో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. నగర పరిధిలోని తెన్నేటి పార్కు వద్ద, యారాడ, సింహాచలం మైక్రోవేవ్‌ స్టేషన్‌ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. భారీవర్షాల కారణంగా వస్తున్న వరదకు విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి సమీపంలో శారదా నదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్‌వే కొట్టుకుపోయింది. రైవాడ జలాశయం గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో అనంతగిరి, దేవరాపల్లి, హుకుంపేట మండలాల్లో 200 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.