సినీ నటుడు శివాజీపై చీటింగ్ కేసు నమోదు

Published: Monday May 14, 2018

టీవీ, సినీ నటుడు బాలాజీపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. తనను మభ్యపెట్టి తననుంచి కిడ్నీ సేకరించి బాలాజీ భార్యకు కిడ్నీ మార్పిడి చేయించారని, అయితే ఇందుకోసం తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి బాలాజీ మోసం చేశాడంటూ యూసుఫ్ గూడకు చెందిన జూనియర్ ఆర్టిస్టు భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నీలు పాడైన తన భార్య కృష్ణవేణికి కిడ్నీ ఇస్తే 20 లక్షల నగదు, నెలకు 15 వేలు, టీవీ, సినీ రంగాల్లో అవకాశాలు కల్పిస్తానని బాలాజీ హామీ ఇచ్చాడని, కానీ వీటిలో వేటినీ నెరవేర్చలేదని బాధితురాలు ఆరోపించింది.

విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 2016 ఆగస్టు లో కిడ్నీ మార్పిడి జరిగిందన్నారు. ఈ ఆరోపణలను పరిశీలించిన పోలీసులు బాలాజీ చీట్ చేశాడనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ అతనిపై సెక్షన్ 420, 506, సెక్షన్ 19 ఆఫ్ ది ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆపరేషన్ విజయవాడలో జరిగింది గనుక తదుపరి దర్యాప్తుకోసం కేసును అక్కడికి బదిలీ చేశారు.