ముఖ్య నేతలకు జగన్‌ నిర్దేశం

Published: Monday January 20, 2020
రాజధాని మార్పుపై ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల వాళ్లూ స్వాగతిస్తున్నట్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో మాట్లాడేలా చూడాలని పార్టీ ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సూచించారు. ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలు, ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. అమరావతి నుంచి సచివాలయం, హైకోర్టు తరలింపునకు అన్ని ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలనూ చర్చలో భాగస్వాములను చేయాలని.. తద్వారా రాష్ట్ర గొంతుకను వినిపించినట్లు అవుతుందని జగన్‌ పేర్కొన్నట్లు తెలిసింది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపిచ్చిన నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఆంక్షలు అమలు చేయడం సహా.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఆయన సమీక్షించారు.
 
 
శాసనసభలో పార్టీలో అంతర్గత సమన్వయంపైనా చర్చించారు. à°ˆ భేటీలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎంవో అధికారులు హాజరయ్యారు. ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఇతర అధికారులతో శాంతి భద్రతలపై సీఎం సమీక్ష జరిపారు.