వైసీపీ నేతలు ఆక్రమిస్తే సీబీఐకి ఫిర్యాదు చేసుకోండి

Published: Monday February 10, 2020

విశాఖలో సెంటు భూమి కూడా కబ్జా కానివ్వబోమని పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం వైసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖలో భూ దోపిడీ జరిగిపోతోందని టీడీపీ నేతలు అనడం దెయ్యా లు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. à°† పార్టీ పాలనలో నాయకులు ప్రభుత్వ భూములను భారీ ఎత్తున ఆక్రమించుకున్నారని ఆరోపించారు. సిట్‌ నివేదిక వచ్చిన తరువాత కబ్జాదారులపై చర్యలు ఉంటాయన్నారు. వైసీపీ నాయకులు, మంత్రులు ఎవరైనా విశాఖలో భూములు కబ్జా చేశారని భావిస్తే.. సీబీఐకి ఫిర్యాదు చేసి దర్యాప్తు చేయించుకోవాలని మంత్రి సవాల్‌ విసిరారు. టీడీపీ నాయకులు అవాస్తవాలతో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ 75శాతం భూములు, వ్యాపారాలు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారివేనని, రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయడంవల్ల వారికే మేలు కలుగుతుందన్నారు. విశాఖలో రాజధాని ఏర్పాటుపై స్థానిక టీడీపీ నాయకులు లోపల సానుకూలంగానే ఉన్నారని, అయితే చంద్రబాబు ఒత్తిడి కారణంగా బయటకు మాత్రం వ్యతిరేకిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.