జగన్‌ సర్కారులో సంక్షేమానికి భారీ కోతలు

Published: Monday July 13, 2020

‘‘రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస మాయ కమ్మేసింది. సీఎం జగన్‌ పథకాలన్నీ మాయ పేలాలే. ఏడాదిలోనే జగన్‌ మాయ నుంచి జనం బయటపడ్డారు. టీడీపీ పథకాలు రద్దుచేసి తెచ్చింది మాయ పథకాలే. రద్దులు.. పేర్లు మార్పుతో జగన్‌ చేసింది మాయాజాలమే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంలో సగానికి సగం కోత పెట్టారు. టీడీపీ 2018-19లో రూ.6,419కోట్లు వ్యయం చేస్తే, వైసీపీ 2019-20లో రూ.3,382కోట్లకు తగ్గించింది. మా ప్రభుత్వంలో రూ.2,767కోట్లు ఎక్కువుగా ఖర్చు చేయడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై టీడీపీకి ఉన్న చిత్తశుద్దికి రుజువు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సబ్‌ప్లాన్‌ నిధుల వ్యయంలో వైసీపీ గణనీయంగా కోతలు పెట్టిందన్నారు. పాత పథకాలను నవరత్నాల్లో కలిపేశారని, అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతు భరోసాలో కలిపినట్లుగానే... అమ్మ ఒడిలో ఇంకొన్ని పథకాలు కలిపేశారని యనమల ఆరోపించారు. పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫి, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, చంద్రన్న బీమా తదితర పథకాలను రద్దుచేశారని యనమల గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర పథకాల్లో కలిపేశారని యనమల పేర్కొన్నారు. 14 నెలల్లో రూ.18,026 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను రద్దుచేశారని ఆయన ధ్వజమెత్తారు. నవశకం పేరుతో 18 లక్షల రేషన్‌కార్డులను, 6 లక్షల ఫించన్లను జగన్‌ సర్కారు రద్దు చేసిందని యనమల ధ్వజమెత్తారు. సాంఘీక సంక్షేమం నిధులను రూ.6,407కోట్ల నుంచి రూ.5,919కోట్లకు కుదించారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంలో 7.63శాతం నిధులు కోతపెట్టారని, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, వయోవృద్దుల సంక్షేమ నిధుల్లో 10.59శాతం కోతపెట్టారని ఆయన తెలిపారు. యువజన సంక్షేమం బడ్జెట్‌లో ఏకంగా 70శాతం కోతపెట్టారని, దాని కేటాయింపులను రూ.2,063 కోట్ల నుంచి రూ.604 కోట్లకు తగ్గించారని యనమల తెలిపారు. ఆర్థిక స్వేచ్చ లేకుంటే ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి, హక్కులను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని, అంబేడ్కర్‌ ఆశయం కూడా ఆర్థిక స్వావలంబనేనని బడుగు, బలహీనవర్గాలకు దానిని కూడా అందనీయడం లేదని వైసీపీ సర్కారుపై యనమల మండిపడ్డారు.