సుశాంత్ సింగ్ కేసుపై సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీ దర్యాప్తు

Published: Monday September 07, 2020

తీగ లాగితే డొంక కదులుతున్న సంకేతాలు కనిపిస్తాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్యహత్య కేసులో మాదకద్రవ్యాల కోణంపై కూడా దర్యాప్తు సంస్థలు దృష్టి సారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ కేసుపై సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తు సాగిస్తున్నాయి.

 

డ్రగ్స్ కోణం నుంచి దర్యాప్తు సాగిస్తున్న ఎన్‌సీబీ ఇందులో ప్రమేయమున్నట్టుగా అనుమానిస్తున్న షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా, దీపేష్ సావంత్‌లను ఇప్పటికే అరెస్టు చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తిని రెండవరోజైన సోమవారంనాడు కూడా ప్రశ్నిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కోసం తన సోదరుడు షోవిక్ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టు రియా చక్రవర్తి ఎన్‌సీబీ విచారణలో అంగీకరించిందని తెలుస్తోంది. అయితే, తన జీవితంలో ఎన్నడూ డ్రగ్స్ తీసుకున్నదే లేదని రియా కరాఖండిగా చెప్పందంటున్నారు.

 

సోమవారం విచారణలో భాగంగా డ్రగ్స్ వ్యాపారి బాసిత్ పరిహార్‌ కనీసం ఐదు సందర్భాల్లో తమను కలిశాడని, అతనే తమ ఇంటికి వచ్చేవాడని రియా ధ్రువీకరించినట్టు తెలుస్తోంది.

 

కాగా, మరో సంచలన విషయాన్ని కూడా రియా వెల్లడించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌లో ప్రమేయమున్న పలువురు బాలీవుడ్ నటుల పేర్లను సైతం ఎన్‌సీబీకి రియా వెల్లడించిందని అంటున్నారు. ప్రస్తుతం 18 నుంచి 19 మంది స్టార్ల పేర్లు ఎన్‌సీబీ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఎవరెవరి పేర్లు రియా వెల్లించిందనేది మాత్రం ఇంకా బయటకు కాలేదు. సుశాంత్ సింగ్ 2016లో డ్రగ్స్‌ గాలానికి చిక్కాడని ఎన్‌సీబీ విచారణలో రియా చెప్పినట్టు తెలుస్తోంది.