‘షాక్‌ కొట్టేలా మద్యం ధరలు..

Published: Friday October 30, 2020

‘షాక్‌ కొట్టేలా మద్యం ధరలు... మద్యపానాన్ని నిరుత్సాహపరచడమే ధ్యేయం’... అని ఘనమైన ప్రకటనలు చేసిన సర్కారు మందు ధరలపై మరోసారి పిల్లిమొగ్గ వేసింది. గతంలో చీప్‌ ధరలు బాగా తగ్గించిన ప్రభుత్వం... ఇప్పుడు మధ్యరకం, ప్రీమియం మద్యం రేట్లు కూడా భారీగా తగ్గించింది. ‘అక్రమ రవాణా పెరిగిపోయింది! స్మగ్లింగ్‌ తగ్గాలంటే ధరలు తగ్గించాలి’ అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. క్వార్టర్‌ సీసాపై కనీసం రూ.వంద నుంచి రూ.250 వరకు తగ్గించింది. ఫుల్‌పై రూ.400 నుంచి రూ.వెయ్యి వరకు తగ్గించింది. దీంతో లాక్‌డౌన్‌లో మూతపడిన షాపులను తిరిగి ప్రారంభించినప్పుడు పెంచిన ధరలు దాదాపుగా మొదటికి వచ్చాయి. మద్యం రకాలను క్వార్టర్‌ సీసా ధర ఆధారంగా పది కేటగిరీలుగా విభజించి... అందులో తొలి రెండు మినహా ఎనిమిది కేటగిరీల్లో ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

రెండు నెలల క్రితం... తొలి రెండు కేటగిరీల ధరలు తగ్గించి, మిగిలినవి భారీగా పెంచేశారు. ఇప్పుడు మిగిలిన కేటగిరీల మద్యం ధరలూ తగ్గించారు. అయితే... తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాలతో పోలిస్తే ఏపీలో మద్యం ధర ఇప్పటికీ 30శాతం అధికంగానే ఉంది.

 

అక్రమ రవాణా వల్లే ధరలు తగ్గించాల్సి వచ్చిందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ‘‘మద్యం అమ్మకాలు తగ్గించేందుకు ధరలు పెంచడంవల్ల పక్క రాష్ర్టాల నుంచి స్మగ్లింగ్‌ పెరిగింది. మీడియం, ప్రీమియం బ్రాండ్ల అక్రమ రవాణా పెరిగింది’’ అని ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది. భారీగా అక్రమమద్యం పట్టుబడుతోందని... మీడియం, ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలను తగ్గిస్తే బాగుంటుందని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ప్రభుత్వానికి నివేదించింది. à°ˆ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా... బీరు, వైన్‌ ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు.