యువత బలహీనతలను ఆసరా ...

Published: Saturday November 21, 2020

యువత బలహీనతలను ఆసరా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్న సైబర్‌ ముఠాను సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఆటకట్టించారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం సిలిగురికి చెందిన ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గరు నిందితులు పరారీలో ఉన్నారు. సైబాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

 

సైబరాబాద్‌ ప్రాంతానికి చెందిన యువకుడు ఇంటర్నెట్‌ సెర్చ్‌ చేస్తున్న క్రమంలో స్పైసీ ఫ్రెండ్‌షిప్‌.కామ్‌ అప్లికేషన్‌ కనిపించింది. దాన్ని ఓపెన్‌ చేయగా.. ఫీమేల్‌ ఎస్కార్టు సర్వీస్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోగలరు. అతి తక్కువ ప్యాకేజీతో ఎక్కువ సర్వీసులు అందిస్తామని ఉంది. దాంతో ఆకర్షితుడైన యువకుడు అందులో తన పేరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. అంతే..! వెంటనే అందమైన అమ్మాయిలు లైన్లోకి వచ్చారు. మత్తెక్కించే మాటలతో వలపు వల విసిరి అతన్ని ట్రాప్‌ చేశారు. వివిధ సర్వీసులు అందిస్తామని నమ్మించి విడతల వారీగా రూ. 13,82,643లు దోచేశారు. ఇంకా రూ.1.50లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తుండటంతో ఇదంతా మోసం అని గుర్తించి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కొద్దిరోజుల్లోనే మరో ఫిర్యాదు అందింది. ఇదేవిధంగా మరో యువకుడు రూ. 1.15లక్షలు పోగొట్టుకున్నాడు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

 

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆదేశాలతో డీసీపీ క్రైమ్స్‌ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రెడ్డి బృందం రంగంలోకి దిగింది. పక్కాగా టెక్నికల్‌ ఆధారాలను సేకరించింది. మోసాలకు పాల్పడుతోంది పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం సిలిగురికి చెందిన సైబర్‌ ముఠాగా గుర్తించారు. సీపీ ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌, ఎస్‌ఐ రాజేంద్ర బృందం సిలిగురి వెళ్లి మకాం వేసింది. వారం రోజుల పాటు కాపుకాసి అన్ని ఆధారాలను పక్కాగా సేకరించి చాకచక్యంగా ముఠా ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.