గుంటూరుకి పాదయాత్రగా వెళుతున్నా.............అగ్రీ గోల్డ్ భాదితులు

Published: Thursday May 31, 2018

గుంటూరు:సమయం మించి పోతుండటం...ఎన్నికలు సమీపిస్తుండటంతో కాలం గడిస్తే తమ గురించి పట్టించుకునేవారుండరన్న ఆందోళనతో అగ్రిగోల్డ్‌ బాధితులు తమ పోరాటం ఉధృతం చేసినట్లు కనిపిస్తోంది.

తమ సొమ్ము తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గుంటూరులో అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయపోరాట దీక్ష జరిగింది. తమకు న్యాయం చేయకుంటే ఉరేసుకుంటామని హెచ్చరిస్తూ బాధితులు ఉరితాళ్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే తమకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తడి తెచ్చేందుకు అగ్రి గోల్డ్ బాధితులు గురువారం ఉదయం గుంటూరు నుంచి వెలగపూడి సచివాలయానికి పాదయాత్రగా వెళ్లనున్నారు.

మరోవైపు à°ˆ పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఎక్కడివరకు కొనసాగించగలిగితే అక్కడకు పాదయాత్ర చేయాలని బాధితుల తరుపు పోరాడుతున్న నేతలు నిర్ణయించారు. గుంటూరులో అగ్రి గోల్డ్ బాధితుల న్యాయపోరాట దీక్షా శిబిరం ప్రారంభం సందర్భంగా అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ బాధితులకు పూర్తిగా చెల్లించే వరకూ తాను బాధ్యత వహిస్తానన్న సిఎం చంద్రబాబు ప్రస్తుతం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.

అగ్రి గోల్డ్ బాధితులందరికీ 30 రోజుల్లో న్యాయం చేయకుంటే తమ ఉద్యమం ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాజమండ్రిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు అగ్రిగోల్డ్‌ బాధితులను ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడటం తగదన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 182 మంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు.

బాధితులకు వెంటనే తొలి విడత సొమ్ము చెల్లించాని ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనకు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయకుమార్‌ సంఘీభావం తెలిపారు.

మరోవైపు అగ్రిగోల్డ్ బాధితుల పాదయాత్ర నేపథ్యంలో గురువారం వారితో మంత్రి నక్కా ఆనందబాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి నక్కా మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే విపక్షాలు కావాలనే అడ్డుకుంటున్నాయని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. బాధితులు ఆందోళన విరమించాలని మంత్రి కోరారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశంపై చర్చిస్తామని, సెలవులు ముగిసిన తర్వాత కోర్టును ఆశ్రయిస్తామని మంత్రి ఆనందబాబు పేర్కొన్నారు. ఈ చర్చల్లో సీపీఐ నేత రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఐజీ గోపాలరావు, అర్బన్ ఎస్పీ విజయరావు తదిదరులు పాల్గొన్నారు