జనసేనతో కలిసి బలమైన శక్తిగా ఎదుగుతాం

Published: Sunday December 20, 2020

‘రాష్ట్రంలో వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా జనసేనతో కలిసి బీజేపీ ఎదుగుతోంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.  రాయలసీమకు తరతరాలుగా అన్యాయం జరుగుతోందని, సీమకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రాలయం మండలంలో నిర్మించిన పుష్కర ఘాట్లను పరిశీలించారు. అక్కడే కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఆతర్వాత కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిని à°—à°¤, ప్రస్తుత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం విషయంలో కేంద్రాన్ని సాయం కోరినట్లు సీమ అభివృద్ధి విషయంలో ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే సీమ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఇసుక కన్నా బంగారం చాలా సులువుగా దొరుకుతోందని భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఎర్ర చందనం అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకునే నాఽథులే లేరని విమర్శించారు. మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరూ పర్యటించటానికి వీల్లేకుండా ఇక్కడొక ప్రత్యేక చట్టం ఉన్నట్లు, à°ˆ చట్టాన్నిదాటి ఎవరూ వెళ్లడానికి వీల్లేదన్న పరిస్థితులు ఉన్నట్లు గమనించానని చెప్పారు.

 

ఇలాంటి చోట్ల ఎమ్మెల్యేలను, అరాచక శక్తులను లెక్కచేసే ప్రసక్తేలేదని మండిపడ్డారు.ప్రభుత్వం నిర్మించిన పుష్కరఘాట్లు నాసిరకంగా ఉన్నాయన్నారు. పుష్కరాలు ముగిసినా ఇంకా పనులు జరగటం విడ్డూరంగా ఉందన్నారు. తుంగభద్ర పుష్కరాల్లో వైసీపీ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టలేదని, పనులు చేయకుండా దోచుకున్నారని ఆరోపించారు. పుష్కర ఘాట్ల నిర్మాణాలలో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తామని చెప్పారు. 108 వాహనాలు 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నా.. వాటిపై ప్రధానమంత్రి ఫొటో లేకపోవడం సరైందికాదన్నారు.