సీఎం జగన్‌కు లోకేశ్‌ సూటి ప్రశ్న

Published: Monday December 28, 2020

‘‘మీ పిల్లలకు మాత్రమే విదేశీ చదువులా? బడుగు, బలహీనవర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా?’’ అని సీఎం జగన్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సూటిగా ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతరులకూ విదేశీ విద్యకు అవకాశం కల్పించిన ‘ఎన్టీఆర్‌ విదేశీ విద్య’ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆదివారం ట్వీట్‌ చేశారు. అదేవిధంగా ‘‘రాయచోటిలో వైసీపీ నేతల ఒత్తిడి, కొంతమంది పోలీసుల నిర్లక్ష్యంతో పూజారి ప్రియాంక చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడుతోంది.

 

ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఆమె తండ్రికి అవమానం ఎదురవడంతో ఆత్మహత్యకు యత్నించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. కాగా, నివర్‌ తుఫాను బాధిత కృష్ణాజిల్లా రైతాంగాన్ని సోమవారం లోకేశ్‌ పరామర్శించనున్నారు. ‘‘అవ్వాతాతలను మోసం చేసిన మీకు నిద్రెలా పడుతోంది జగన్‌రెడ్డీ. ఎన్నికల ముందు ఫించను రూ.3 వేలన్నావ్‌. కుర్చీ ఎక్కగానే రూ.250 పెంచావ్‌. ఇప్పటికే అవ్వాతాత రూ.1250 నష్టపోయారు’’ అని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కాగా, ఇళ్ల పట్టాల పంపిణీపై శ్వేతపత్రం విడుదల చేసి, స్థలాల సేకరణలో జరిగిన రూ.6,500 కోట్ల అవినీతిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని టీడీపీ అధికార ప్రతినిధి చెంగల్రాయుడు డిమాండ్‌ చేశారు. ఏ తప్పూ చేయకుండా 16 నెలలు జైలులో ఉన్నామని జగన్‌, విజయసాయి ప్రమా ణం చేయగలరా? అని టీడీపీ అధికారప్రతినిధి సూర్యప్రకాశ్‌ ప్రశ్నించారు.   

ఆస్ర్టేలియాలోని మెల్‌బోర్న్‌లో టీడీపీ కొత్త కమిటీ ఏర్పాటైంది. కమిటీ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2021 క్యాలెండర్‌ను విడుదల చేసి కొత్త వెబ్‌సైట్‌ని  రూపొందించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, అధికార ప్రతినిధి పట్టాభి వారికి అభినందనలు తెలిపారు.  

కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ విధులు నిర్వహిస్తూ కరోనాతో మృతి చెందిన విద్యుత్‌ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. ఆదివారం టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సంఘం 2021 డైరీ, క్యాలెండర్‌లను మాజీ మంత్రులు ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ తదితరులు ఆవిష్కరించారు