శ్రీరాముడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు.

Published: Thursday January 21, 2021

మెట్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు. విద్యాసాగర్ రావు దిష్టి బొమ్మను దహనం చేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు,కార్యకర్తలను అడ్డుకునేందుకు యత్నించారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటా పోటీ నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. తమ వాళ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కాగా అయోధ్య రామాలయానికి విరాళాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ పిలుపునిచ్చారు. నియోజవర్గంలో విద్యాసాగర్ రావు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు.. మన దగ్గర రాముడి ఆలయాలు లేవా అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, కొత్త నాటకానికి తెర లేపుతున్నారంటూ బీజేపీని ఉద్దేశించి అన్నారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా.. తామంతా శ్రీరాముని భక్తులమేనని వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను బీజేపీతో పాటు పలు సంఘాలు తప్పుబడుతున్నాయి.