పశ్చిమ గోదావరిలో వింత వ్యాధి

Published: Monday January 25, 2021

దెందులూరు మండలం కొమిరేపల్లికి చెందిన కౌలు రైతు కాలి ఏసుపాదం(65) పశువుల మేత కోసం ఆదివారం పొలం వెళ్లాడు. మూర్ఛ వ్యాధితో కొట్టుమిట్టాడుతూ పక్కనే వున్న పంట కాలువలో పడి చనిపోయాడు. స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి శవ పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిపోర్టు వస్తే మరణం పై స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఏసుపాదం మృతితో గ్రామంలో అలజడి రేగింది. బిక్కుబిక్కుమంటూ ఉంటున్న ప్రజలకు ఈ వార్త మరింత భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామంలో ఇప్పటి వరకు 29 కేసులు నమోదు కాగా, ఆదివారం మూర్చతో ఒక రైతు మృతి చెందగా, మరో మహిళ కళ్లు తిరిగి పడిపోవడంతో మొత్తం కేసుల సంఖ్య 31కు చేరింది. బాధితులసంఖ్య క్రమేపీ పెరుగు తూండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

గ్రామంలో ఎక్కువ మందికి వంకాయ కూర తినడం వల్ల వచ్చిందని చర్చ నడుస్తోంది. కూరగాయల సాగులో పురుగు మందులు వాడి ఉండటం.. కూర వండేటప్పుడు వంకాయలను సరిగా శుభ్రం చేయకపోవడం వల్లే ఇది జరిగి ఉండవచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అంతు చిక్కని వ్యాధికి కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియజేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

భీమడోలు, పూళ్ల గ్రామాల్లో మరో రెండు కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 38à°•à°¿ చేరింది. శుక్రవారం కేసులు నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వైద్యులు కొత్త కేసులు రావడంతో కలకలం రేగింది. భీమడోలు బీసీ కాలనీకి చెందిన బి.రాంబాబు ఉదయం పొలం పనులకు వెళ్లి ఫిట్స్‌తో కుప్ప కూలిపోయాడు. తోటి కూలీలు భీమడోలు సామాజిక వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్య చికిత్సకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూళ్లలో 30 ఏళ్ల గర్భిణీ ప్రమీల మధ్యాహ్నం వంట చేస్తుండగా ఫిట్స్‌ వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను పూళ్ల వైద్య కేంద్రానికి తరలించగా చికిత్స చేసి కోలుకున్న తరువాత డిశ్చార్జి చేసినట్లు వైద్యులు లీలా ప్రసాద్‌ తెలిపారు.