వచ్చే ఐదురోజులూ వానలే వానలు

Published: Sunday June 03, 2018


దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పెరిగాయి. అక్కడక్కడా ఈదురుగాలులు, పిడుగులు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదారు రోజులు ఇదే మాదిరి వాతావరణం కొనసాగనున్నది. వచ్చే నాలుగైదు రోజుల్లో దక్షిణాదిలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈనెల ఏడు లేదా ఎనిమిదికల్లా రుతుపవనాలు కోస్తా, రాయలసీమ, తెలంగాణాలను తాకే అవకాశం ఉన్నదని ఓ వాతావరణ నిపుణుడు తెలిపారు.
 
కిందిస్థాయిలో నైరుతి గాలులు వీస్తున్నాయని, అయితే ఉపరితలం పైకి గాలులు రావల్సి ఉందని పేర్కొన్నారు. అందుకే రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి గాలులు వీస్తాయనే అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తు తం రాయలసీమలో రుతుపవనాలకు అనువైన వాతావరణం నెలకొనడంతో తొలకరి సీజన్‌ మొదలైనట్టేనని పేర్కొన్నారు. కాగా, శనివారం అత్యధికంగా కృష్ణా జిల్లాలోని వత్సవాయిలో 82మిల్లీమీటర్ల వర్షం పడింది. కాగా మరో 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.